Leading News Portal in Telugu

PM Modi slams Congress ruled Karnataka, Telangana after Kharge unreal promises remark


  • ఎన్నికల హామీలపై ఖర్గే వ్యాఖ్యలకు మోడీ కౌంటర్

  • కాంగ్రెస్‌ నిజ స్వరూపం బయటపడిందని వ్యాఖ్య
PM Modi: ఎన్నికల హామీలపై ఖర్గే వ్యాఖ్యలకు మోడీ కౌంటర్

కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారయ్యాయని మోడీ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Goa: కాంగ్రెస్‌కు స్పీకర్ షాక్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పిటిషన్ కొట్టివేత

రాష్ట్ర బడ్జెట్‌ ఆధారంగా ఎన్నికల గ్యారంటీలను ప్రకటించాలని, ఇష్టమొచ్చినట్లు హామీలివ్వరాదని రాష్ట్ర ఇంచార్జ్‌లకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం సూచించారు. ఆర్థికంగా అమలు చేయగలిగే వాగ్దానాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. దీనికి కౌంటర్‌గా మోడీ ట్వీట్‌ చేశారు. ‘‘అడ్డగోలు హామీలు ప్రకటించడం చాలా తేలికైన విషయమే. కానీ వాటిని సరిగ్గా అమలు చేయడం కఠినం, అసాధ్యమనే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడే గుర్తించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తారు. వాటిని ఎప్పటికీ నెరవేర్చలేరని కూడా వారికి తెలుసు. కాంగ్రెస్‌ నిజ స్వరూపం ఇప్పుడు బయట పడింది. ప్రజల ముందు దోషుల్లా నిలబడి ఉంది. ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. ఇది రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేయడమే. ఇలాంటి రాజకీయాల వల్ల నష్టపోయే బాధితులు పేదలు, యువకులు, రైతులు, మహిళలే. వీరంతా గ్యారంటీల ప్రయోజనాలకు దూరమవుతారు. ఉన్న పథకాలు కూడా వారికి దక్కుండాపోతాయి’ అని మోడీ పేర్కొన్నారు. హర్యానా ప్రజలు మాత్రం కాంగ్రెస్ మోసాన్ని తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. గతంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అమలు కాని వాగ్దానాలు చేసి మోసం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయన్నారు. భారతదేశ ప్రజలు అభివృద్ధి మరియు పురోగతిని కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.