- జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లోని మజమా గ్రామంలో.
- ఉగ్రవాదుల దాడి..
- ఇద్దరు యువకులు మృతి.

Terrorist Attack In Budgam: జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్‌లోని మజమా గ్రామంలో ఉగ్రవాదులు ఇద్దరు యువకుల్ని కాల్చిచంపారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి ప్రజలు. ఆ క్షతగాత్రులను సంజయ్, ఉస్మాన్‌గా గుర్తించారు అధికారులు. వారిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాసులు. వీరు ఆ ప్రాంతంలోని జల్ జీవన్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులని అధికారులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో వారిద్దరూ కోలుకోలేక మరణించారని అధికారులు తెలియచేసారు.
గత 12 రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో సామాన్యులపై దాడి జరగడం ఇది రెండోసారి. అంతకుముందు అక్టోబర్ 20న గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు 7 మందిని కాల్చిచంపారు. వీరిలో ఒక వైద్యుడు షానవాజ్ అహ్మద్‌గా గుర్తించారు. అంతకుముందు అక్టోబర్ 16న షోపియాన్‌లో ఉగ్రవాదులు స్థానికేతర యువకుడిని కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్‌లో అక్టోబరు నెలలో తీవ్రవాద సంబంధిత సంఘటనలు పెరిగాయి. ఫలితంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది పౌరులు, ముగ్గురు చొరబాటుదారులు, ముగ్గురు సైనికులు, ఇద్దరు ఆర్మీ పోర్టర్లు, ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు.
మరణించిన పౌరుల్లో ఒక స్థానిక కాశ్మీరీ, ఇద్దరు జమ్మూ, 5 మంది జమ్మూ – కాశ్మీర్ వెలుపల ప్రాంతాల వారు ఉన్నారు. ఇది కాకుండా, ఈ సంఘటనలలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. కిష్త్వార్‌లోని ఛత్రు ప్రాంతంలో ఉమ్మడి దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌తో ఈ దాడులు మొదలయ్యాయి.