Leading News Portal in Telugu

Chairman PM Economic Advisory Council Dr Bibek Debroy Passed Away


  • తుదిశ్వాస విడిచిన పీఎం ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ బిబేక్ దేబ్రోయ్..

  • సంతాపం తెలిపిన ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు..
Bibek Debroy: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ బిబేక్‌ దేబ్రోయ్‌ కన్నుమూత

Bibek Debroy: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి ఛైర్మన్, ఆర్థిక వేత్త బిబేక్ దేబ్రోయ్ (69)ఈ రోజు (శుక్రవారం) కన్నుమూశారు. పేగు సంబంధిత సమస్యతో దేబ్రోయ్ మృతి చెందినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. బిబేక్ దేబ్రోయ్ రామకృష్ణ మిషన్ స్కూల్ (నరేంద్రపూర్), ప్రెసిడెన్సీ కాలేజీ (కోల్‌కతా), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ట్రినిటీ కాలేజీ (కేంబ్రిడ్జ్)లో విద్యాభ్యాసం చేశాడు. ఆయన ప్రెసిడెన్సీ కాలేజీ (కోల్‌కతా), గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (పూణే), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఢిల్లీ)లో విధులు నిర్వహించారు. ఇక, ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రోయ్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

కాగా, బిబేక్ దేబ్రోయ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. డాక్టర్ బిబేక్ తెలివైన పండితులు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికం లాంటి విభిన్న రంగాలలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టులో పేర్కొన్నారు. తన మేధో సంపత్తి, రచనల ద్వారా భారతదేశంపై చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషితో పాటు ప్రాచీన గ్రంథాలపై బిబేక్ దేబ్రోయ్ పని చేయడం.. వాటిని యువకులకు అందుబాటులో ఉంచడం గొప్ప విశేషమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.