Leading News Portal in Telugu

Defense Minister reacts on terror attacks in Jammu and Kashmir


  • జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు
  • స్పందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్
  • దాడులు దురదృష్టకరమన్న మంత్రి
  • భద్రతా లోపం లేదని స్పష్టం
Rajnath Singh: భద్రతా లోపం లేదు.. వరుస ఉగ్రదాడులపై స్పందించిన రక్షణ మంత్రి..

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విలేకరులతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. భద్రత లోపం వల్ల ఈ దాడులు జరగడం లేదని పునరుద్ఘాటించారు. మన భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ముగిసే సమయం వస్తుందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో దాడులు దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా బలగాలు తగిన సమాధానం ఇవ్వడం వల్ల చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని గుర్తుచేశారు.

READ MORE: US Bans Indian Companies:15 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. కారణం?

జమ్మూ కాశ్మీర్‌లో చాలా చోట్ల ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లు సహా నలుగురు గాయపడ్డారు. బందిపొరా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. శుక్రవారం, బుద్గామ్ జిల్లాలోని మజమా ప్రాంతంలో ఉగ్రవాదులు ఇద్దరు కాశ్మీరేతరులపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బుద్గాం జిల్లాలోని మగామ్ ప్రాంతంలోని మజామాలో ఇద్దరు కూలీలపై ఉగ్రవాదులు ఈరోజు కాల్పులు జరిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా.. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అక్టోబర్ 29న, ఆర్మీ కాన్వాయ్‌పై దాడి తర్వాత, అఖ్నూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అక్టోబరు 20న గందర్‌బల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై సొరంగం నిర్మాణ స్థలంపై ఉగ్రవాదులు దాడి చేసి ఆరుగురు కార్మికులను హతమార్చారు.