మోదీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు
విజయవాడ: టీడీపీ మహానాడు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ.. పనులు తక్కువ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే అని ఎద్దేవా చేశారు.
మోదీ పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యం దాపురించిందని చంద్రబాబు అన్నారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడిందన్నారు. ప్రధాని మోదీ చర్యలతో పాలన గాడి తప్పిందని విరుచుకుపడ్డారు.
దేశంలో బీజేపీ కలుషిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తూ ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. విలువల గురించి బీజేపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో శశికళకు పట్టిన గతి పడుతుందని విపక్షనేతకు భయమని… అందుకే హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.