Leading News Portal in Telugu

దయచేసి వినండి..

ఇంటర్నెట్‌డెస్క్‌: దయచేసి వినండి… దయచేసి వినండి… రాధికరామ్‌ కుమార్తె అక్షయ పుట్టిన రోజు వేడుక నాలుగో ప్లాట్‌ఫాం మీద మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మరికొద్ది రోజుల్లో రైల్వే స్టేషన్లలో ఇలాంటి ప్రకటనలు వినొచ్చు. అదేంటి రైళ్లకు సంబంధించిన ప్రకటనలు కాకుండా ఇలాంటి వేడుకల గురించి ఎందుకు చెబుతారు అనుకుంటున్నారా? రైల్వే శాఖ తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణం. చాలా రోజుల నుంచి ఆలోచనల్లో ఉన్న పార్టీ ఎట్‌ ప్లాట్‌ఫామ్‌ను రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.

ప్రతి ఒక్కరికీ జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలుంటాయి. వాటిని జీవితాంతం గుర్తుంచుకునేలా చాలా మంది ప్లాన్‌ చేసుకుంటారు. కొందరు నడిసంద్రంలో పెళ్లి చేసుకుంటే..ఇంకొందరు గాలిలో విహరిస్తూ ఉంగరాలు మార్చుకుంటారు. నింగి నేలకు మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేమను వ్యక్తం చేసిన వారెందరో. ఇటీవల కాలంలో చిన్న చిన్న పార్టీలు, విందులను వైవిధ్యభరితంగా చేసుకోవడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలాంటి వారికోసమే ఇండియన్‌ రైల్వేస్‌ సరికొత్త ఆలోచనను తెరమీదకు తెచ్చింది. అదే ప్లాట్‌ఫాంపై పార్టీ. దీనికి గుజరాత్‌లోని వడోదర ప్రయోగాత్మక వేదికైంది. ఇంతకూ ఏంటీ ప్లాట్‌ఫాం పార్టీ..

ప్రయాణికులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైల్వే స్టేషన్లు ఖాళీగానే ఉంటాయి. కొన్ని రైళ్లు మాత్రమే ఆ స్టేషన్లలో ఆగుతాయి. ఆయా స్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కన్నా..వాటిని నిర్వహించడానికి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉన్న సందర్భాలూ లేకపోలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని..పుట్టినరోజు వేడుకలు, చిన్నపాటి సమావేశాలు, రిసెప్షన్లు తదితర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఇండియన్‌ రైల్వే ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ఫాంలను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించే యోచనలో ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌పై దృష్టి సారించింది. అయితే ఈ విధానాన్ని ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ముంబయి లాంటి సబర్బన్‌ స్టేషన్లలో అమలు చేసే అవకాశం లేదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

ఏయే స్టేషన్లు‌!

వడోదరలోని మకర్‌పుర, విశ్వామిత్రి, బజ్వ, అంక్లేశ్వర్‌ స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించనున్నారు. వడోదర స్టేషన్‌లో దీని కోసం ప్రత్యేకంగా ఓ ఫ్లాట్‌ఫాంనే ఏర్పాటు చేశారట. గత ఏడాది ఆగస్టులోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ భద్రతా పరమైన కారణాలవల్ల ఇప్పటివరకు అమలు కాలేదు.

అనుమతులు ఎలా!

ప్లాట్‌ ఫాం అద్దెకు తీసుకోవాలనుకునేవారు స్థానిక రైల్వే డివిజన్‌లోని కమర్షియల్‌ విభాగ అధికారి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ముందస్తుగా దరఖాస్తు చేసుకొని ఎంత మంది హాజరవుతారు? ఎన్నిగంటలకు కార్యక్రమం ప్రారంభిస్తారు? తదితర వివరాలను అందిస్తే..తదనుగుణంగా అధికారి ప్లాట్‌ఫాంను ఖరారు చేస్తారు. దాదాపు 3 గంటలపాటు ఖాళీగా ఉండే ప్లాట్‌ఫాంలనే అద్దెకిస్తారు.