Leading News Portal in Telugu

ఎమ్మెల్యేల అనర్హతపై భిన్నాభిప్రాయం

చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ పి.ధనపాల్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ సమర్థించగా.. మరోజడ్జి జస్టిస్‌ ఎం.సుందర్‌ వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో తుది తీర్పు కోసం ఈ కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈ కేసును ఎవరు విచారించాలో ప్రధాన న్యాయమూర్తి తర్వాతి సీనియర్‌ న్యాయమూర్తి నిర్ణయిస్తారని చీఫ్‌ జస్టిస్‌ ఇందిరా బెనర్జీ తెలిపారు. మూడో జడ్జి తీర్పు వెలువరించేంత వరకు యథాతథస్థితి అంటే 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కొనసాగుతుందన్నారు.

జయలలిత మరణంతో అనిశ్చితి
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. సీఎం పదవి నుంచి పన్నీర్‌ సెల్వంను తప్పించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని జయలలిత నెచ్చెలి శశికళ భావించారు. దీన్ని పన్నీర్‌ సెల్వం వ్యతిరేకించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు అనూహ్యంగా శశికళ జైలుకెళ్లడంతో సీఎం పగ్గాలను పళనిస్వామికి అప్పగించారు. శశికళ సోదరి కుమారుడు దినకరన్‌ కూడా పళనిస్వామికి మద్దతిచ్చారు.

అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు కలసిపోయి శశికళ, దినకరన్‌లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్‌ సెల్వం ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పన్నీర్‌తో చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన దినకరన్‌.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి పళనిస్వామికి ఎదురుతిరిగారు. దీంతో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద ఆ 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ గత సెప్టెంబర్‌ 18న అనర్హత వేటు వేశారు. స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.

అనర్హత రద్దై ఉంటే ప్రభుత్వానికి ముప్పే
ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పు పళనిస్వామి ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే 18 మంది అనర్హులైనందున ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రద్దై ఉండి ఉంటే పళని ప్రభుత్వానికి చాలా చిక్కులు వచ్చేవి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు స్పీకర్‌ మినహా అధికార పార్టీ అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా.. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 89 మంది, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 8 మంది, ఐయూఎంల్‌కు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు.

దినకరన్‌ స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ మధ్యే మరో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 22 అయింది. వీరు డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికున్న 98 ఎమ్మెల్యేలతో కలిస్తే వీరి బలం 120గా మారేది. అప్పుడు అధికార పార్టీ బలం స్పీకర్‌తో కలిపి 114గా ఉండేది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయేది. హైకోర్టు తీర్పుపై దినకరన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కొనసాగింపునకు వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించారు.