Leading News Portal in Telugu

అవి చౌకబారు వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిగిందని ఇటీవల వెల్లడైన కథనాలపై వచ్చిన విమర్శలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తోసిపుచ్చారు. మోదీ హత్యకు జరిగిన కుట్ర వెల్లడి కావడంపై సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవీస్‌ తప్పుపట్టారు. కుట్ర కోణాన్ని హాస్యాస్పదంగా, హారర్‌ సినిమా కథనంగా పవార్‌ మాట్లాడటం ఆయన హోదాకు తగదని అన్నారు. పవార్‌ ప్రకటన దురదృష్టకరమని ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయాలు చేయడం తగదని పవార్‌కు సీఎం హితవు పలికారు.ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడవడం కలకలం రేపిన విషయం తెలిసిందే.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే మావోయిస్టులు ప్రధాని మోదీని అంతం చేసేందుకు ప్లాన్‌ వేశారని పుణే పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ లేఖను ఇటీవల విడుదల చేశారు. మావోయిస్టులు ఆ లేఖను గతేడాది ఏప్రిల్‌లో రాశారు.