Leading News Portal in Telugu

నిపుణులు బారెడు.. జీతాలు మూరెడు!

ముంబై: నైపుణ్యతకు పట్టం అనే నానుడికి భిన్నమైన ధోరణి భారత్‌లో దర్శనమివ్వబోతోందని ఒక సర్వే పేర్కొంది. లాస్‌ ఏంజెల్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ ‘వేతనాల పెరుగుదల’ పేరుతో ఒక సర్వేను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే…

► 2030 నాటికి వేతనాల ఎదుగుదలలేని ఏకైక ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉండబోతోంది. దీనికి కారణం దేశంలో నిపుణుల సంఖ్య గణనీయంగా పెరగడమే కావడం గమనార్హం. అవసరమైనదానికంటే నిపుణులైన ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల వారికి వేతనాలు పెరగని పరిస్థితి నెలకొంటుంది.
► ఇతర దేశాల తరహాలో కాకుండా భారత్‌లో 2030 నాటకి చక్కటి నైపుణ్యం ఉన్న ప్రజల సంఖ్య అధికం అవనుంది.
► ఇక ఆసియా పసిఫిక్‌సహా ఇతర దేశాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి కనబడుతోంది. నిపుణులకు ఆయా దేశాల్లో వేతనాలు పెరగనున్నాయి. ఆయా దేశాల్లో నిపుణుల కొరత దీనికి కారణం.
​​​​​​​► ఇక అంతర్జాతీయంగా చూస్తే… నిపుణులకు లభించనున్న భారీ వేతనాల వల్ల 2030 నాటికి వార్షిక కార్మిక వ్యయం 2.5 ట్రిలియన్‌ డాలర్లకు పైగా పెరుగుతుంది.
​​​​​​​►ఉద్యోగ వ్యయాలు భారీగా ఎదుర్కొనే భారీ ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా, జర్మనీలూ ఉంటాయి.
​​​​​​​► ఒక్క ఆసియా పసిఫిక్‌ను చూస్తే, 2030 నాటికి వేతనాల పెరుగుదల భారం ట్రిలియన్‌ డాలర్లకన్నా అధికంగా ఉండనుంది. ఇది కంపెనీలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. బిజినెస్‌ వ్యూహాలను మార్చుకోకపోతే, మొత్తంగా వ్యాపారాలే ముప్పు ఎదుర్కోవచ్చు.
​​​​​​​► మొత్తంగా చూస్తే, ఆయా దేశాల్లో వేతనాల పెంపు ద్రవ్యోల్బణానికి అనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. ఇక వేతనాల పెరుగుదల వల్ల తయారీ రంగంపై తీవ్ర ప్రతికూలత పడే వీలుంది. పలు వర్థమాన దేశాల వృద్ధికి ఈ రంగమే ఊతం ఇస్తున్న సంగతి తెలిసిందే.
​​​​​​​►ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు డిమాండ్‌ విషయంలో 2020, 2025, 2030 సంవత్సరాలు కీలక మైలురాళ్లు. భారత్‌తోపాటు 20 దేశాల్లో ఈ ధోరణి ఉంటుంది. ఫైనాన్షియల్‌–బిజినెస్‌ సేవలు, టెక్నాలజీ, మీడియా–టెలికం, తయారీ రంగాల్లో ఉద్యోగాలు భారీగా రానున్నాయి.