లోక్‌సభ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్.. అధికారులు అప్రమత్తం
రాష్ట్రపతి భవన్‌లో ఓ పారిశుధ్య కార్మికుడి బంధువుకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభ సెక్రటేరియెట్‌లోనూ కరోనా కలకలం రేగింది. లోక్‌సభ సచివాలయంలో పనిచేసే ఓ సిబ్బందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. 10 రోజుల క్రితం అనారోగ్యం బారినపడడంతో RML ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఈసీజీతో పాటు ఇతర పరీక్షలు చేయించిన తర్వాత రెండు మూడు రోజులకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆ తర్వాత కూడా అతడి ఆరోగ్యం మెరగవలేదు. దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండడంతో మరోసారి RML ఆస్పత్రికి వెళ్లాడు. అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో డాక్టర్లు పరీక్షలు చేశారు. దానికి సంబంధించిన రిపోర్టులు సోమవారం వచ్చాయి. అతడికి కరోనా సోకినట్లు రిపోర్టుల్లో తేలింది.
ఐతే సదరు కరోనా బాధితుడు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తించడం లేదు. 36, గురుద్వారా రకబ్ గంజ్ రోడ్డులోని ప్రింటింగ్ అండ్ పబ్లికేషన్స్ డిపార్ట్‌మెంట్ పనిచేస్తున్నాడు. బాధితుడు కుమారుడు మాత్రం పార్లమెంట్ కాంప్లెక్స్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ కరోనా ప్రభావంతో పార్లమెంట్ ఉభయ సభలు గత నెలలో వాయిదా పడడంతో.. అప్పటి నుంచి అక్కడ సిబ్బంది ఎవరూ లేరు. చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ఐనప్పటికీ పార్లమెంట్ సెక్రటేరియెట్ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై ఆరా తీస్తున్నారు. అప్పటికే అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.