సూర్యాపేట జిల్లాపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌లో ఆ సేవలు..
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సూర్యాపేటలో ప్రారంభించిన ఆన్‌లైన్ యాప్‌నకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం మటన్, చికెన్‌లను కూడా ఇకపై ఆన్‌లైన్ ద్వారానే అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. సూర్యాపేట పట్టణంలోని తాజా పరిణామాలపై ఆదివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామంజూలరెడ్డి తదితరులతో మంత్రి జగదీష్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టాలని తెలిపారు. మటన్, చికెన్ సహా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నట్టు చెప్పారు. కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న సూర్యాపేట పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి పాలు, కూరగాయలు వార్డుల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆన్‌లైన్‌లో మెడిసిన్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తోన్న ఫార్మాసిస్టులను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు నిత్యావసర సరుకులు, ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుకోసం పట్టణ శివార్లలో ఉన్న ఎస్వీ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో హోల్‌సెల్ దుకాణాలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే పట్టణంలో ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.