Leading News Portal in Telugu

రాష్ట్రాలకు షాక్… ఆ చికిత్సపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు

కరోనాకు మందు లేకపోవడంతో… ఆ వ్యాధి బారిన పడిన వారు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు వైద్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్లాస్మా థెరపీ చికిత్సను అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో ప్లాస్మా థెరపీ చికిత్స ద్వారా పలువురు కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే కరోనాపై పోరాటంలో అందరికీ ఆశాకిరణంగా కనిపిస్తున్న ఈ ప్లాస్మా థెరపీ చికిత్సపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్లాస్మా థెరపీ అనేది ఇంకా పూర్తిస్థాయిలో కరోనాను నయం చేసే థెరపీ కాదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ దీనిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగం దశలోనే ఉందని అన్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ దీనిపై అధ్యయనం చేస్తోందని వివరించారు. దీన్ని ఐసీఎంఆర్ ఆమోదించేవరకు ఎవరూ ఈ చికిత్సను అమలు చేయకూడదని స్పష్టం చేశారు. ఇది రోగులకు ప్రమాదకరంతో పాటు చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించారు.