Leading News Portal in Telugu

జగన్ ఒవైసీ భేటీ.. మర్మమేంటి? | jagan owaisi meet soon| reason| behind| ap| politics| alliance| muslim| minorities


posted on Aug 15, 2023 7:05AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి కలవనున్నట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల  పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నది. అది కూడా హైదరాబాద్ నుండి తాడేపల్లి వెళ్లి మరీ   అసదుద్దీన్ సీఎం నివాసంలోనే భేటీ అవుతారంటున్నారు. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ గా ఇది ఉండబోతుందని కూడా వైసీపీ వర్గాల సమాచారం. సీఎం జగనే స్వయంగా అసదుద్దీన్ ను తాడేపల్లి ఆహ్వానించారనీ, ఈ భేటీ త్వరలోనే ఈ భేటీ జరగనుందని ఆ వర్గాలు చెబుతున్నాయి.  దీంతో అసలు ఈ ఇద్దరు నేతల భేటీ వెనక ఆంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. అసలు ఈ నేతల మధ్య గతంలో ఎలాంటి అనుబంధం లేదు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఎక్కడా వీరికి సంబంధాలు లేవు. జగన్   వైసీపీ  తెలంగాణతో తెగదెంపులు చేసుకోగా.. ఓవైసీ హైదరాబాద్ పునాదిగా రాజకీయాలు చేసుకుంటున్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎంఐఎం పోటీ చేసినా ఇప్పటి వరకూ ఏపీలో మాత్రం పోటీ చేయనేలేదు.

మరి ఇలాంటి సమయంలో ఈ భేటీ ఏమిటి? ఎందుకు? అన్న ఆసక్తి సర్వత్రా కలుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరూ హైదరాబాద్ లేదా విజయవాడలో ఎక్కడా కలసిన దాఖలాలు అయితే లేవు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు   అసదుద్దీన్ వెళ్లి కలిసి వచ్చారు. అలాగే  గతంలో ఒకసారి రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నిలబెట్టిన రాష్టప్రతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని గెలిపించేందుకు చంచల్‌గూడ జెైల్లో ఉన్న వెైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవెైసీ కలిశారు. అప్పుడు యూపీఏ నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని.. కాంగ్రెస్‌ రాయబారిగా ఒవెైసీ జగన్‌తో మాట్లాడి రాష్టప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని కోరారు. ఆ సమయంలో జగన్ తల్లి విజయమ్మతో కూడా అసదుద్దీన్   చర్చించారు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా ఈ రెండు పార్టీల నేతలు కలిసిన దాఖలాలు లేవు.

 అయితే, ఇప్పుడు ఒక్కసారి లంచ్ మీటింగ్ లో ఇరువురు నేతలూ కలవనున్నారన్న సమాచారంతో ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైందిప.  ఎంఐఎం ఒక్కో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకొనే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఏపీలో కూడా ఇలాంటి ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టే ఉద్దేశ్యంతోనే జగన్ మోహన్ రెడ్డిని కలిసి మద్దతు కావాలని కోరుతుందా అనే చర్చ ఒకటి జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో ఏపీలో ముస్లిం మైనార్టీలు వైసీపీకి ఎక్కువగా మద్దతుగా ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ తో ఉన్న ఈ వర్గం ఆ తర్వాత వైసీపీ వైపు మళ్లింది. అదే సమయంలో టీడీపీ 2014లో బీజేపీతో పొత్తుకు వెళ్లడం కూడా ఈ వర్గం జగన్మోహన్ రెడ్డి వైపు చూసేలా చేసింది. కానీ  వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ వర్గాన్ని అసలు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రత్యేకించి వీరి కోసం నాలుగేళ్ళలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడంతో ఈ వర్గం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది.

 ఈ నేపథ్యంలో ఓవైసీను ఇక్కడ రంగంలోకి దింపి ప్రచారం చేయించడం.. కావాలంటే ఎంఐఎం పార్టీ కూడా ఏపీలో పోటీ చేసేలా పొత్తుకు దిగి ఎక్కడో చోట కనీసం ఒక్క అసెంబ్లీ స్థానంలో అయినా పోటీ చేయించి మైనార్టీల ఓట్లను గంపగుత్తగా తన వైపుకు తిప్పుకొనే ప్రణాళిక ఏమైనా జగన్ మదిలో ఉందా అన్న చర్చ కూడా మొదలైంది.  ఈసారి మళ్ళీ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న   వైసీపీ అందులో భాగంగానే ఓవైసీ రాకకు ఆహ్వానం పలికిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అసలు ఈ భేటీ వెనక మూల కారణం ఏంటన్నది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందేనని పరిశీలకులు భావిస్తున్నారు.