వివేకా హత్య.. ఏం జరిగిందో విజయసాయి చెప్పకనే చెప్పేశారా? | vijay sai revealed on viveka murder case| election| sympathy| hyderbad
posted on Aug 14, 2023 2:49PM
వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగస్ట్ 10వ తేదీన ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు… రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఏమిటంటే.. ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్‌లో ఉండే కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారు. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నవించుకుంటున్నా! .అంతే.. ఆ ట్వీట్ పై ఆంధ్రప్రదేశ్ పోలిటికల్ సర్కిల్‌లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
ఈ ట్విట్ వెనుక ఉన్న అర్థం.. పరమార్థం ఏమిటన్నది అంతుపట్టడం లేదని ఆ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది. ఆంధ్రాపై పెత్తనం కోసం హైదరాబాద్‌లో ఉండి కొందరు కుట్రదారులు విషం చిమ్ముతున్నారని.. హత్యలు చేసైనా ప్రభుత్వంపై వ్యతిరేకత రాజేయాలని కుట్రపన్నుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి చేసిన ఈ తాజా ట్విట్ 2019 ఎన్నికలకు ముందు… అప్పటి విపక్ష నేత జగన్ సొంత చిన్నాన్న, మాజీ మంత్రి పులివెందులలోని తన సొంత ఇంట్లో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్.. హైదరాబాద్‌లోనే ఉన్నారు.
హత్య జరిగిన తరువాత ఆయన తాపీగా సాయంత్రం పులివెందులకు చేరుకొని.. తన చిన్నాన్నా ఇంత దారుణంగా హత్యకు గురి కావడం, విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై కోడికత్తితో దాడి జరగడం వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ.. పులివెందుల్లో వివేకా మృతదేహం వద్దే మీడియా ముందు ప్రకటించారని.. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎన్నికలు రావడం…. ఆ ఎన్నికల ఫలితాల్లో ఎవరు, ఏ పార్టీ భారీగా లబ్ది పోందిందో అందరికీ తెలిసిందేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అప్పట్లో ఆ హత్య, ఆ కోడికత్తి దాడి వల్ల ఎవరికి సానుభూతి పవనాలు వీచాయో తెలిసిందేనని అంటున్నారు. ఇంకోవైపు వైయస్ వివేకా అత్యంత దారుణంగా హత్యకు గురి అయితే.. వైయస్ వివేకా గుండెపోటుతో మరణించారంటూ మార్చి 15వ తేదీ ఉదయం 6.00 గంటలకే ఇదే విజయసాయిరెడీ మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటించారని… అయితే ఈ వివేకా హత్య కేసు విచారణ.. సీబీఐ చేతిలోకి వెళ్లిన తర్వాత.. నిందితుల్లో ఒక్కరైన దస్తగిరి అప్రూవర్‌గా మారి.. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రదారులు ఎవరో వారి పేర్లు బయటకు పొక్కినా కూడా.. విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా మాత్రం కనిపించలేదు. వినిపించలేదని.. కానీ అదే విజయసాయిరెడ్డి ఇలా ట్విట్ చేయడం చూస్తుంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. 2019 ఎన్నికల ముందు నాటి ఘటనలు మళ్లీ రాష్ట్రంలో పునరావృతమవుతాయా? అంటే.. ఏమో అనే సందేహం సైతం వ్యక్తమవుతోంది. అలా అయితే ఈ సారి సానుభూతి పొందేందుకు దారుణాలకు పాల్పడే అవకాశాలున్నాయంటూ విజయసాయి చేసిన ట్వీట్ ప్రధాన్యత సంతరించుకుంది. గతంలో తమకు సానుభూతి పవనాలు వీచేలా చేసిన రెండు సంఘటనలలోనూ ఇప్పటికీ నిందితులు ఎవరన్నది తేలలేదు. వివేకా హత్య కేసు అయితే దర్యాప్తు పూర్తయ్యింద. కోర్టులో విచారణ జరుగుతోంది. దర్యాప్తు సందర్భంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాడు నారాసుర రక్త చరిత్ర అంటూ ఊరూ వాడా ఏకం చేసిన వారు దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలతో నోరెత్తలేని స్థితిలో పడ్డారు. నాడు ఎవరైతో నారాసుర రక్త చరిత అంటూ ఆరోపణలు గుప్పించారో వారే నేడు సీబీఐ దర్యాప్తులో అనుమానితులుగా, నిందితులుగా తేలారు. ఇక ఇప్పుడు నాలుగున్నరేళ్ల తరువాత విజయసాయి రెడ్డి మళ్లీ ఎన్నికలలో సానుభూతి కోసం దారుణాలు, హత్యలు అంటూ ప్రస్తావించారు. ఆయన చెప్పినట్లుగా అప్పట్లోలా విపక్షాలకు చెందిన నాయకులెవరూ హైదరాబాద్ లో తాపీగా కూర్చుని లేరు. తెలుగుదేశం అధినేత, జనసేనాని ఇరువురకూ కూడా ప్రజల మధ్యలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో విజయసాయి ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసినదీ, ఎవరిని టార్గెట్ గా చేశారు అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.