వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి | avinash reddy attend cbi court| viveka| murder| case| letter| ramsingh
posted on Aug 14, 2023 11:52AM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం (ఆగస్టు 14) సీబీఐ కోర్టుకు హారయ్యారు. వివేకా హత్య కేసులో ఏ8గా ఉన్న అవినాశ్ రెడ్డి ప్రస్తుతం యాంటిసిపేటరీ బెయిలు మీద ఉన్న సంగతి తెలిసిందే. కాగా వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవలే కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ఉండగా ఈ కేసు విచారణకు ఈ నెల 14 అంటే సోమవారం కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ విషయం అలా ఉంటే.. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును సమీక్షించాలని కోరుతూ అవినాష్ రెడ్డి జూన్ 19న సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. ఆ లేఖలో సీబీఐ మాజీ డైరెక్టర్ దర్యాప్తుపై పలు ఆరోపణలు గుప్పించారు. తానే టార్గెట్ గా దర్యాప్తు సాగిందని ఆరోపణలు గుప్పించారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ రామ్ సింగ్ హయాంలో వివేకా హత్య కేసు దర్యాప్తు వివక్ష పూరితంగా సాగిందనీ, విచారణ ఏ మాత్రం సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. అయితే ఈ లేఖకు సంబంధించి సీబీఐ ఇంత వరకూ స్పందించలేదు. ఇక పోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్‌లను జైలు అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.