Leading News Portal in Telugu

మంగళగిరిలో లోకేష్ కు అపూర్వ ఆదరణ | unprecedented acceptance to lokesh in mangalagiri| people| rush| padayatra| contstituency| whole| behind| tdp| teaded| ap


posted on Aug 16, 2023 10:49AM

మంగళగిరిలో లోకేష్ ఎంట్రీయే అదిరిపోయింది. తొలి సారిగా అసెంబ్లీకి ఆయన పోటీ చేసింది మంగళగిరి నుంచే.. తొలి ప్రయత్నంలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి నుంచి ఆయన ఓ అజేయ శక్తిగా ఎదిగారనడానికి యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు జనం నీరాజనాలు పలికిన తీరు కళ్లకు కట్టింది. లోకేష్ ను నియోజకవర్గానికి దూరం చేయడానికి జగన్ సర్కార్, ఆయన పార్టీ చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు.  ఒటమి పెంచిన కసితో, పట్టుదలతో  ఆయన నియోజకవర్గంలో ప్రణాళికాబద్దంగా పని చేసుకుంటూ వచ్చారు.

నిత్యం అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. ఆ ఎఫెక్ట్   పాదయాత్రలో  అడుగడుగునా కనిపించింది. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని, లోకేష్ ను బలహీనం చేసేందుకు  అధికార బలంతో నియోజకవర్గ స్థాయినేతల్ని జగన్ రెడ్డి  వైసీపీలో చేర్చుకున్నారు. నిత్యం వేధింపులతో తెలుగుదేశం శ్రేణులను నిర్వీర్యం చేయడానికి శతథా ప్రయత్నించారు. అయితే ఎంత బలంగా అణచివేయడానికి ప్రయత్నిస్తే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో లోకేష్ నాయకత్వంలోని తెలుగుదేశం శ్రేణులు నియోజకవర్గంలో బలం పుంజుకున్నాయి. దానికి తోడు లోకేష్ పని తీరు, పరిపక్వతతో కూడిన రాజకీయాలు ప్రజలలో ఆయన పట్ల అభిమానం పెరిగేలా చేశాయి. దీంతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అడుగుపెట్టే సరికి మొత్తం నియోజకవర్గం అంతా ఆయన వెంట నడిచిందా అన్నట్లుగా జనం పోటెత్తారు.  వీరికితోడు గుంటూరు చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన వారు కూడా ఉత్సాహంగా లోకేష్ పాదయాత్రలో ఆయనతో అడుగుకలిపి నడిచారు.

ఆయన పాదయాత్రకు పోటెత్తిన జనం అసంఖ్యాకం అనడానికి మూడు నాలుగు కిలోమీటర్ల నడకకే ఆరున్నర గంటలకు పైగా సమయం పట్టడాన్ని తెలుస్తున్నది.  పాదయాత్ర ప్రారంభానికి ముందు వరకూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగానే తన కార్యకలాపాలన్నీ సాగించారు. 2019 ఎన్నికలలో ఎక్కడ వైసీపీ పై చేయి సాధించిందో అక్కడే తనపై అభిమానం వెల్లువెత్తేలా వ్యూహాత్మకంగా పని చేశారు. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ సమస్యలను గుర్తించి, అడ్రస్ చేసి వాటి పరిష్కారం కోసం పని చేశారు. అదే సమయంలో గత ఎన్నికలలో  మంగళగిరి నుంచి విజయం సాధించిన వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నిష్క్రియాపరత్వం వల్ల ప్రజలకు దూరం అయ్యారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నది లేదు.

దీంతో ప్రజలలో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దానికి తోడు జగన్ సర్కార్ విధానాల పట్ల సహజంగానే పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలు వెరసి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పట్ల అభిమానం, ఆయన తమకు అండగా ఉంటాడన్న విశ్వాసం అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది.  మంగళగిరిలో లోకేష్ జోరు కు.. ఎలా అడ్డుకట్ట వేయాలో ఐ ప్యాక్ టీమ్‌కూ అర్థం కావడం లేదు.   మంచి చేసి.. ప్రజల అభిమానాన్ని గెలుచుకోవాలన్న ధ్యేయంతో లోకేష్ వేసిన అడుగులు ఇప్పడు ఆయనకు జనం బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.