Leading News Portal in Telugu

వైసీపీలో పాతవారు కొత్తవారు అందరిదీ పక్క చూపేనా? | new and old all looking aside in ycp| antiincumbency| jagan


posted on Aug 16, 2023 3:14PM

 ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేతల పరిస్థితి అయోమయంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలో ఉండాలా.. వీడి వెళ్లాలా.. వెళ్తే ఏ పార్టీలోకి వెళ్ళాలి? ఇలా ఎన్నో చర్చలు వైసీపీ నేతల మధ్య సాగుతున్నాయి. వైసీపీపై వ్యతిరేకత ప్రజలలో స్ఫష్టంగా కనిపిస్తున్నది. గడప గడపకి కార్యక్రమం పుణ్యమా అని ఎమ్మెల్యేలే ప్రజల వ్యతిరేకతను కళ్ళతో చూశారు. టీడీపీ నేతల కార్యక్రమాలకు ప్రజల స్పందన కూడా చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీలో ఉండడం శ్రేయస్కరం కాదని ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఒక అంచనాకి వచ్చేశారు. మరికొందరు అసలు వైసీపీ అధిష్టానమే టికెట్లు ఇవ్వదనే ఆలోచనతో కొత్త దారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వైసీపీకి వెళ్ళినవారు, ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీతో కలిసిన వారు మరికొందరు కూడా పునరాలోచన చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా ఇద్దరు ముగ్గురు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. ఇలా మొత్తం మీద ఇప్పుడు వైసీపీలో పాత వారు, కొత్త వారు అందరూ పక్క చూపులు చూస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఉత్తరాంధ్ర లో అయితే వైసీపీలో ఇలాంటి నేతలు అరడజను మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ వైసీపీకి గుడ్ బై చెప్పేయగా.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా వైసీపీలో ఇమడలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు తెలుగుదేశంలో చేరిపోగా గణేష్ కూడా త్వరలోనే పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నది. గణేష్ టీడీపీకి పాత నాయకుడే, టీడీపీ నుండి గెలిచి వైసీపీలో చేరగా ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి చేరనున్నట్లు కనిపిస్తుంది.

ఇక, ఉత్తరాంధ్రలో వైసీపీకి వెన్ను దన్నుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుండి ముగ్గురు నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు విస్తృతంగా ప్రచారంలో ఉంది.న ఇప్పటికే ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఆ వార్తలకు ఇటు వైసీపీ నుంచి కానీ, అటు బొత్స కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవరూ ఖండించలేదు.  దీంతో బొత్స కుటుంబ సభ్యులు పార్టీ మారడం ఖాయమేనని అనుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.  వీరితో పాటు ఉత్తరాంధ్ర నుండి శ్రీవాణి, అప్పల నాయుడు, అప్పల నరసయ్య, వీరభద్రస్వామి, గొల్ల బాబురావు, ఉమా శంకర్ గణేష్ పేర్లు కూడా వైసీపీని వీడుతారన్న వార్తలు వినవస్తున్నాయి.  

ఇక కోస్తా జిల్లాలకు వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరం నుండి యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడి టీడీపీలో చేరడం దాదాపు ఖరారైంది. లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రవేశించే సమయానికి యార్లగడ్డ చేరిక పూర్తి కానుంది. వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి టచ్ లో ఉన్నారు. వీరు కాకుండా వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారితో సహా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే మరో ఏడెనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుండి గెలిచి వైసీపీకి సానుభూతి పరుడిగా మారిపోయారు. ఇప్పటికే ఆయన కుమారుడిని వైసీపీలోకి పంపగా.. ఇప్పుడు కరణం బలరాం పునరాలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం ఉంది. మరోవైపు చీరాల నుండి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా పార్టీ నుండి జారుకోవాలని చూస్తున్నట్లు చెప్తున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుండి బహిష్కృతులయ్యారు. వీరు ముగ్గురూ కూడా ఇప్పటికే  తెలుగుదేశంకు జై కొట్టేశారు. వీరితో పాటు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికలలో ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడలేని కష్టాలు వచ్చి పడ్డాయి. పోర్టులు, పరిశ్రమలు, విమానాశ్రయాలని ఆశపెట్టి ఒక్కటీ పూర్తి చేయలేకపోవడం, అభివృద్ధి అనే మాట వినిపించక ప్రజలు నేతలపై తిరగబడే పరిస్థితి కనిపిస్తుండడంతో అవకాశం ఉన్న వరకు వీలైనంత త్వరగా గుడ్ బై చెప్పేందుకు చాలామంది ఎమ్మెల్యేలు వేచి చూస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.