ఇక ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు!? | private liquor shops in ap| new| policy| funds| acquire| elections| promise
posted on Aug 17, 2023 4:40PM
అన్ని విధాలుగా అప్రదిష్ట మూటకట్టుకున్న జగన్ రెడ్డి మద్యం పాలసీ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ మారబోతున్నదా? ఇప్పటి వరకూ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని జగన్ సర్కారే నిర్వహిస్తూ వస్తున్నది. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లను విక్రయిస్తూ.. దేశంలో ఎక్కడా లేనంత అధిక ధరలకు విక్రయిస్తూ ఏపీ మద్యం పాలసీ రాష్ట్రంలో మందుబాబుల జేబులను, ఆరోగ్యాన్నీ గుల్ల చేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు మరింతగా మందుబాబులను పీల్చి పిప్పి చేసి వారి నుంచి మరింత దండుకునే విధంగా ఏపీ సర్కార్ మద్యం పాలసీని మర్చేందుకు సమాయత్తమౌతున్నదని ప్రభుత్వ వర్గాల ద్వారానే తెలుస్తున్నది. ఎందుకంటే సర్కార్ నుంచి వస్తున్న సమాధానం నిధుల సమస్య. నిధుల లభ్యత కోసం మందుబాబుల్ని మరింత పిండుకోవడం కోసం మద్యం దుకాణాల వేలానికి జగన్ సర్కార్ రెడీ అయ్యిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వమే నడుపుతోంది. దశల వారీగా మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ వచ్చే ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసి ఓట్లు అడుగుతామన్నారు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం సంగతి అటుంచి.. మద్య నిషేధం మా వల్ల కాదంటూ జగన్ చేతులెత్తేశారు. ప్రస్తుత మద్యం పాలసీ మరో నెలన్నరలో, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అక్టోబర్ 1తో ముగుస్తుంది. దీంతో మద్యం దుకాణాల వేలం ద్వారా నిధుల కోసం జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలకు తోడు ప్రైవేటు మద్యం దుకాణాలు కూడా వెలుస్తాయి. భారీగా నిధులు సమకూరాలంటే మద్యం దుకాణాల వేలం వినా మరో మార్గం లేదని జగన్ సర్కార్ నిర్ణయానికి వచ్చేసింది.
మద్యం పాలసీని మార్చాలంటే అందుకు అసెంబ్లీ ఆమోదం అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో జగన్ ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం అన్నది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. సభలో జగన్ పార్టీకి ఉన్న మంద బలం అటువంటిది మరి. అయితే అసెంబ్లీ ఆమోదం పొందాలంటే వచ్చే నెల వరకూ ఆగక తప్పదు.
ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. అంటే కొత్త మద్యం పాలసీని సంబంధించి ఆమోదం కోసం ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. కొత్త విధానం వల్ల ఏపీలో మద్యం పేర మరింత దోపిడీకి తెరలేవడం ఖాయమని అంటున్నారు.