తెలుగుదేశం గూటికే యార్లగడ్డ! | yarlagadda asks babu appointment| gannavaram| tdp| ticket| suspense| end
posted on Aug 18, 2023 3:05PM
యార్లగడ్డ దారెటు అన్న విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. ఆయన చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమైంది. శుక్రవారం (ఆగస్టు 18) యార్లగడ్డ తన ముఖ్య అనుచరులతో శుక్రవారం (ఆగస్టు 18)న సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినట్లు తెలిపారు. అంతే కాకుండా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయనను కోరనున్నట్లు చెప్పారు. తన విజ్ణప్తిని చంద్రబాబు పరిగణనలోనికి తీసుకుని పార్టీ టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు.
దీంతో గత కొన్ని రోజులుగా యార్లగడ్డ దారెటు అన్న చర్చకు తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్ల క్లారిటీ ఇచ్చేసి తెర దించారు. మొత్తం మీద రానున్న రోజులలో వైసీపీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమంటూ ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం వాస్తవమేననడానికి యార్లగడ్డ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాలని తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలూ తాము తెలుగుదేశంకు దగ్గరౌతున్నామని విస్పష్టంగా చెప్పేశారు. అంతే కాకుండా రానున్న రోజులలో జగన్ పార్టీలో ఉండేవారెవరు, పార్టీని వీడి పోయే వారెవరు అన్న ప్రశ్నకు వైసీపీ అగ్రనాయకత్వమే కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితులలో ఉంది.
రానున్న రోజులలో పార్టీ నుంచి వలసలు భారీగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి మరో నాయకుడు యార్లగడ్డ పార్టీ వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. ఒక విధంగా చెప్పాలంటే రాజధాని అమరావతికి అటు కృష్ణా, ఇటు గుంటూరు ఉమ్మడి జిల్లాలు ఈసారి ఎన్నికలలో విజేతలను నిర్ణయించడంలో అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే. జగన్ మూడు రాజధానుల జపం పుణ్యమా అని ఈ రెండు ఉమ్మడి జిల్లాలలో ఈసారి వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలో చాలా మంది నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఇలాంటి వారందరికీ గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరడం ద్వారా ఒక దారి చూపారని కూడా విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి చాలా కాలంగా యార్లగడ్డ వైసీపీని వీడడం ఖాయమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతూనే ఉంది. అయితే ఈ రోజు వరకూ వరకూ ఆయన స్వయంగా పార్టీ మార్పు విషయం కానీ, ఏ పార్టీలో చేరతాను అన్న విషయాన్ని కానీ చెప్పలేదు. వైసీపీ అధిష్టానం దిగివచ్చి తన అసమ్మతిని, అసంతృప్తిని అడ్రస్ చేసి.. ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తుందా అని ఇన్ని రోజులూ వేచి చూశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే రోజులు గడిచిపోతున్నా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో.. ఆయన తెలుగుదేశంలో చేరనున్నట్లు ప్రకటించేశారు. బహుశా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో సాగుతున్న సమయంలో యార్లగడ్డ టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారని తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేసి తన సత్తా చాటుకోవాలని యార్లగడ్డ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నారనీ అంటున్నారు. ఇటీవల యార్లగడ్డ తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఆ సందర్భంగా చేసిన ప్రసంగం కూడా ఆయన తెలుగుదేశం గూటికి చేరనున్నారని అంతా భావించడానికి కారణమైంది. ఎక్కడో అమెరికాలో వ్యాపారాలు చేసుకునే యార్లగడ్డను వైసీపీ 2019 ఎన్నికల సమయంలో అతి కష్టమ్మీద పార్టీలో చేర్చుకుంది. అప్పుడు తెలుగుదేశం నుండి గన్నవరం బరిలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించడమే లక్ష్యంగా యార్లగడ్డని గన్నవరం బరిలో నిలబెట్టింది.
తన రాజకీయ అరంగేట్రం విజయంతో ఆరంభం కావాలన్న ఉద్దేశంతో నాటి ఎన్నికలలో యార్లగడ్డ భారీగానే ఖర్చు చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే ఆ ఎన్నికలలో రాష్ట్రం అంతటా వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచినా తెలుగుదేశంకు గట్టి పట్టు ఉన్న గన్నవరంలో మాత్రం ఓటమి చవిచూసింది. దీంతో వైసీపీ యార్లగడ్డను పక్కన పెట్టేసి తెలుగుదేశం తరఫున విజయం సాధించిన వల్లభనేని వంశీని పార్టీ పంచన చేరుకుంది. వంశీ కూడా అధికారికంగా వైసీపీ తీర్ధం కప్పుకోకపోయినా.. ఆయన వైసీపీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలలో గన్నవరం వైసీపీ టికెట్ వల్లభనేని వంశీకే దక్కుతుందనీ, ఈ మేరకు ఇప్పటికే వంశీకి జగన్ స్పష్టత ఇచ్చారనీ అంటున్నారు. దీంతో సహజంగానే యార్లగడ్డ వైపీపీతో చాలా కాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా వంశీపై బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన ఎప్పుడో వైసీపీతో అనుబంధం తెంచుకున్నారనీ, ఇక ఇప్పుడు పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ఆయన చేసిన ప్రకటన లాంఛనమేని అంటున్నారు.