Leading News Portal in Telugu

అన్నా చెళ్లెళ్ల పోరు.. ఇంటిగుట్టు బయటపడేనా? | sharmila versus jgan| ap| politics| family| secrets| open| apcc| chief| ycp| government| gunmen


posted on Aug 19, 2023 7:39AM

వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో అసలేం జరుగుతుంది? ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఎందుకు దూరమయ్యారు? జగన్, ఆయన భార్య భారతిలను మినహాయించి మిగతా కుటుంబ సభ్యులంతా ఎందుకు ఒక్కటయ్యారు? కేవలం ఆస్తి తగాదాల వలనే వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చిందా? లేక పదవుల దగ్గర తేడా వచ్చిందా? అసలెందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఇదే ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉండే వారితో పాటు రాజకీయ వర్గాలలో కూడా జరుగుతున్న చర్చ. తెలంగాణలో పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాలకు దూరమైన వైఎస్ షర్మిల ఇప్పుడు తిరిగి ఏపీ రాజకీయాలలోకి వెళ్లడం దాదాపు ఖాయమైపోయింది. ఆ మాటకొస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి అలనాడు తన తండ్రి బాధ్యతలు నిర్వహించిన పీసీసీ పదవిలో ఆమర కుమార్తె షర్మిల క్రీయాశీలక రాజకీయాలు నడపనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి తెరవెనుక సన్నాహాలన్నీ పూర్తి కాగా, ఇక అధికారిక విలీనమే తరువాయిగా రాజకీయ వర్గాలు   చెబుతున్నాయి.

 దీంతో సహజంగానే వైఎస్ కుటుంబంలో విబేధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక షర్మిలను రాజ్యసభకు పంపించాలని ప్రతిపాదన వచ్చింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని తన భుజస్కంధాలపై మోసిన షర్మిల తనను రాజ్యసభ సభ్యురాలిగా  చేయాలని కోరడం తప్పేమీ కాదు. కానీ, అన్న జగన్ ఈ విషయాన్ని దాటవేస్తుండడంతో తల్లి విజయమ్మ నుండి ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో జగన్ మరింత మొండిగా మారిపోయారు. అసలే అప్పటికే ఆస్తి పంపకాలలో కినుక వహించి ఉన్న జగన్-భారతి దంపతులు షర్మిలను రాజ్యసభకు పంపేందుకు అసలు ఇష్టపడ లేదు. దీంతో షర్మిల మరో పార్టీతో ప్రజలలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం ఈ వ్యవహారాన్ని సామరస్యంగానే చక్కదిద్దుకోవాలని, అన్నా చెళ్లెళ్ల మధ్య సయోధ్య కుదర్చాలనీ అప్పట్లో ప్రయత్నించారు. కానీ, జగన్ అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడమే కాకుండా..  షర్మిల ఏపీ రాజకీయాల జోలికి రాకూడదని కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారితో తీవ్ర హెచ్చరికలు పంపారని అప్పట్లో ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వారు చెబుతున్నారు. ఆ కారణంగానే షర్మిల తెలంగాణలో పార్టీని ఏర్నాటు చేశారని అంటున్నారు. కాగా, షర్మిల తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో  ఇప్పుడు ఎలాగైనా తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో   ఏపీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే  కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం ప్రతిపాదన బయటకి రాగానే జగన్ మరోసారి షర్మిల, తల్లి విజయమ్మకు హెచ్చరికలు పంపారట. గతంలో తెలంగాణకి వెళ్ళిపోతామంటేనే ప్రాణభిక్ష పెట్టానని, ఇప్పుడు మళ్ళీ ఇలా ఏపీ రాజకీయల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారని వైఎస్ కుటుంబంతో సన్నిహిత పరిచయాలున్న వారి ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్నది. అంతే కాకుండా ఏపీ ప్రభుత్వం తరపు నుండి  షర్మిలకు భద్రత కోసం ఇచ్చిన ఇద్దరు గన్ మెన్ లను ఉపసంహరించుకున్నారు. దీంతో  విజయమ్మ తనకు కేటాయించిన   గన్మెన్లను కూడా వెనక్కు వెళ్లిపోవాలని స్వచ్ఛందంగా కోరడంతో జగన్ వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అయితే, ఏ క్షణమైనా నలుగురు గన్ మెన్ లను జగన్ సర్కార్ ఉపసంహరించుకున్నా  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనమై  షర్మిల ఏపీ రాజకీయాలలోకి అడుగుపెడితే ఈ ఆదేశాలు రావడం గ్యారంటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 వైఎస్ వివేకా హత్యకేసులో సునీతకు షర్మిల మద్దతు ఇవ్వడం వెనక కూడా అన్న చెల్లెళ్ళ మధ్య విబేధాలే కారణంగా చెబుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా.. అన్న విజయం కోసం తన శక్తికి మించి సాయం చేసినా.. తనకు పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టడం.. కనీసం సోదరి అనే మమకారం కూడా లేకుండా బెదిరింపులకు దిగడం సహించలేకనే షర్మిల.. వివేకా హత్యకేసులో స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఇక అన్న జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే షర్మిల ఏపీ రాజకీయాలలో క్రియాశీలం కానున్నట్లు  తెలుస్తున్నది. అదే జరిగితే వైఎస్ కుటుంబంలో కలహాల దగ్గర నుండి.. వైఎస్ వివేకా దోషుల వరకూ అన్ని అంశాలు బయట పడడం ఖాయంగా కనిపిస్తున్నది!