పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడు?.. పవన్ మాటల ఆంతర్యం ఏంటి? | when alliances discussion end| pawan| comments| inner| meaning| janasena| telugudesham| bjp| ap
posted on Aug 19, 2023 10:20AM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పొడుపుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారా? పొత్తులు ఖాయం.. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతున్నాయన్న హింట్ ఇచ్చారా? తెలుగుదేశంలో జనసేన ఒక్కటే కలిసి నడుస్తుందా? బీజేపీని కూడా కలుపుకుని వస్తుందా? అన్న విషయం ఒక్కటే తేలాల్సి ఉందని ఆయన చెబుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
వారాహి మూడో విడత యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడి.. వచ్చే ఎన్నికలలో పొత్తులతోనే ముందుకు వెళతాం అని నిక్కచ్చిగా చెప్పేశారు. పొత్తుల విధి విధానాలపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు. దీంతో మరో సారి ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఎవరెవరు కలిసి ఎన్నికల బరిలో దిగుతారు. సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది అన్న చర్చలు జోరందుకున్నాయి.
తెలుగుదేశం, జనసేన,బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతాయా? 2014 నాటి పరిస్థితిని పునరావృతం చేస్తాయా? లేకపోతే.. ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలు కలిసి రంగంలోకి దిగుతాయా, తెలుగుదేశం ఒంటరిగానే ఎన్నికల రణరంగంలో తన సత్తా చాటుతుందా? లేక బీజేపీని వదుల్చుకుని జనసేన తెలుగుదేశంతో చేతులు కలుపుతుందా? అన్న విషయంలో సర్వత్రా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పైన అనుకున్న మూడు ఆప్షన్లకే అవకాశం ఉందని, మరి జనసేన వాటిలో ఏ ఆప్షన్ ను ఎంచుకుంటుందో తెలియాల్సి ఉందనీ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో పొత్తల విషయంలో మొట్టమొదటిగా మాట్లాడింది జనసేనానే కావడంతో ఇప్పుడు బంతి కూడా ఆయన కోర్టులోనే ఉంది. పొత్తులు లేకుండా పోటీ చేస్తే 2019 ఫలితమే పునరావృతమౌతుందా అన్న అనుమానాలు జనసేనానిలో బలంగా ఉన్నాయనీ, వారాహి యాత్రలో ఆయన చేస్తున్న ప్రసంగాలను బట్టి అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు. అధికారంలోకి రావాలని తాను అనుకుంటే చాలదనీ, ప్రజలు కూడా అనుకోవాలి అంటూ ఆయన చెబుతున్న మాటలు.. జనసేనాని ఉద్దేశాన్ని చాటి చెబుతున్నాయి.
ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన ఉన్నవారైనా సరే బీజేపీ పొత్త వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉంటుందని భావించరు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కనుక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో ఆ పార్టీతో పొత్తు ఉంటే బెటర్ అన్న భావనతో ఉంటారు. జనసేనాని మాటలను బట్టి చూస్తుంటే.. ఆయన ఉద్దేశం కూడా అదే అన్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఇక తెలుగుదేశంను కలుపుకుని పోకుండా ఒక్క బీజేపీని నమ్ముకుని జనసేన ముందుకు సాగితే.. ఆ పార్టీతో పాటుగా మునక తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలను అర్ధం చేసుకోవలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకూ జనసేన తన మిత్రపక్షం బీజేపీని కూడా తెలుగుదేశంతో పొత్తులోకి తీసుకువద్దామన్న ఉద్దేశంతో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది కుదరకపోతే కమలానికి బైబై చెప్పేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో పొత్తుల విషయంలో ఒకింత బెట్టుగా వ్యవహరించి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను పొందాలన్న వ్యూహంతో జనసేనాని ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూడా పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందనీ, తొందరపాటు అవసరం లేదనీ, అవసరమైతే ఒంటరిగానే సత్తా చాటాలన్న ఉద్దేశాన్ని చాటుతోందని అంటున్నారు. ఇక బీజేపీ విషయంలో తెలుగుదేశం ఒక స్పష్టతతో ఉందనీ, కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీ లోని జగన్ సర్కార్ కు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ.. పొత్తుకు వస్తామంటూ తెలుగుదేశం పార్టీకి స్నేహహస్తాన్ని చాటితే ఆ చేయి అందుకోవడానికి తాము సిద్ధంగా లేవని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ అక్రమాలు, తనపై జరిగిన దాడుల వివరాలతో రాసిన లేఖకు అటువైపు నుంచి వచ్చే సమాధానాన్ని బట్టే కమలం పార్టీలో పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని తెలుగుదేశం చెప్పకనే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని నోట పొత్తలు ఖాయం.. చర్చలు జరుగుతున్నాయన్న మాట రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.