Leading News Portal in Telugu

వైసీపీలో ఐ-ప్యాక్ సర్వే లీక్ టెన్షన్! | ipac survey leak tenssion in ycp| anti incumbancy| severe| defeat


posted on Aug 20, 2023 4:59AM

వైసీపీ ప్రభుత్వంపై ఏపీలో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని   రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రతిపక్ష నేతల సభలు, యాత్రలకు జనం భారీగా తరలి వస్తుంటే.. జగన్ సహా వైసీపీ నేతలు ఎక్కడా జనంలో తిరిగు పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే సభలు కూడా వెలవెలబోతున్నాయి. వచ్చిన ఆ కొద్ది మందీ కూడా ముఖ్యమంత్రి ప్రసంగం మొదలెట్టగానే లేచి వెళ్లి పోతున్నారు. ఇక గడపగడపకూ అంటూనో, ఏదో కార్యక్రమంలో భాగంగానో ప్రజలలోకి వెళ్లిన అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై  ఎక్కడిక్కడ  జనం తిరగడడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఇది ఏపీలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా  వైసీపీ కూడా ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలు.. ఎంపీలపై ప్రజల అభిప్రాయంపై విస్తృతంగా సర్వేలు నిర్వహించుకుంటోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ తో పాటు మరో రెండు ప్రైవేట్ సంస్థలతో కూడా వైసీపీ సర్వేలు నిర్వహిస్తోందిది. ఈ సర్వే రిపోర్టుల తొలి విడత ఫలితాల ఆధారంగా గతంలో తాడేపల్లిలోని తన వివాసంలో  సీఎం జగన్   పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక త్వరలోనే ఈ సర్వేల పూర్తిస్థాయి ఫలితాలు జగన్ చేతికి అందనున్నాయని, ఆ ఫలితాల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 ఈ లోగా టైమ్స్ నౌ సర్వే ఒకటి బయటకు వచ్చింది. అయితే ఆ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉండటంతో వైసీపీ నాయకులే ఆ సర్వేను నమ్మడం లేదు. పరిగణనలోనికి తీసుకోవడం లేదు. అయితే,  తాజాగా  ఐ -ప్యాక్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన చార్ట్ ను బట్టి చూస్తే వైసీపీ నేతల్లో విజయావకాశాలు తగ్గిపోతున్నాయని ఐ ప్యాక్ తేల్చేసినట్లే కనిపిస్తోంది. కేవలం ఎంపీల పనితీరుపై ఐప్యాక్ ఈ రిపోర్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ సర్వే ఫలితాలు నిజమా అబద్దమా అన్నది తేల్చలేని పరిస్థితి కానీ.. ఇప్పుడు ఈ రిపోర్టు ఫలితాలు మాత్రం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. గత ఎన్నికలలో వైసీపీ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీ స్థానాలను దక్కించుకోగా.. ఇందులో ఐదారుగురు ఈసారి పార్లమెంటుకు పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతూ ఉంది.

అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఐ-ప్యాక్ సర్వే రిపోర్టు ప్రకారం గత ఎన్నికలలో గెలిచిన 22 మందిలో 16 మందికి తిరిగి గెలిచే అవకాశం లేదని తెలుస్తున్నది. అమలాపురం, అనంతపూర్, అనకాపల్లి, బాపట్ల, ఏలూరు, చిత్తూరు, గుంటూరు, హిందూపురం, కాకినాడ, మచిలీపట్టణం, నరసాపురం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం స్థానాలలో వైసీపీకి గెలిచే అవకాశాలు లేవని ఐప్యాక్ సర్వే తేల్చేసింది. ఈ 16 పార్లమెంట్ స్థానాలలో కేవలం 2 నుండి మూడు స్థానాలలో ఏదైనా అవకాశం ఉంటే పుంజుకునే అవకాశం ఉందని.. అదే సమయంలో ఇవి కాకుండా మరో 6 స్థానాలలో తీవ్ర పోటీ ఉంటుందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. కర్నూల్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి స్థానాలలో పోటా పోటీ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితం చెబుతున్నది. కడప, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాలలో మాత్రమే వైసీపీకి ఒకింత మొగ్గు ఉందన్నది ఈ సర్వే ఫలితం.

ఇక, వైసీపీ గెలుస్తుందని భావించిన మూడు స్థానాలలో కూడా నాలుగు శాతం లీడ్ మాత్రమే కనిపిస్తుండగా.. పోటా పోటీ ఉంటుందని చెప్తున్న స్థానాలలో ఎక్కువ శాతం టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు కూడా చూపించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయా స్థానాలలో పది నుండి 15 శాతం ఓట్లను తన వైపుకు తిప్పుకోనున్నట్లు సర్వేలో చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా 25 పార్లమెంట్ స్థానాలలో కూడా 40 నుండి 53 శాతం ఓటింగ్ దక్కించుకోనున్నట్లు పేర్కొనగా.. 45 శాతంపైన ఓట్లు దక్కించుకున్న ప్రతి స్థానంలో విజయకేతనం ఎగరేయనున్నట్లు చూపించారు.

కాగా, ఈ సర్వే ఫలితం నిజమా అబద్దమా అన్నది పక్కన పెడితే.. ఈ సర్వే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం మాత్రం ఖాయం. ఒకవేళ ఈ సర్వే నిజమైతే.. దీనిని బట్టి తిప్పి తిప్పి కొట్టినా 35 నుండి 50 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కుతాయి. ఒకవేళ ఈ సర్వే ఫేక్ అని కొట్టిపారేసినా అసలే అసంతృప్తితో ఉన్న ప్రజలపై ఈ ఫలితాలు మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో ఎటు తిరిగి ఈ ఫలితాలతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైనట్లే కనిపిస్తుంది.