Leading News Portal in Telugu

పంచాయతీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం | telugudesham win majority seats in local body by poll| rural| ycp| people| reject| anti


posted on Aug 20, 2023 3:45AM

వైనాట్ 175 అని ముఖ్యమంత్రి జగన్ అంటుంటే.. వైనాట్ డిఫీట్ అని జనం అంటున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అందులోనూ స్థానిక ఉప ఎన్నికలలో అధికార పార్టీ విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుంది. కానీ ఏపీలో జనం జగన్ సర్కార్ పై ఎంత ఆగ్రహంతో ఉన్నారో తాజాగా జరిగిన పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూపాయి. ఇప్పటి వరకూ విశ్లేషకులు, పరిశీలకులు, రాజకీయ పండితులు కూడా పట్టణ ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని బలం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాలలో మాత్రం వైసీపీ పట్టు ఒకింత బలంగా ఉందని చెబుతూ వచ్చారు. అయితే వారి అంచనా తప్పని శనివారం (ఆగస్టు 18)న జరిగిన పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నిక తేల్చి చెప్పేసింది. జగన్ సర్కార్ పై జనాగ్రహం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అన్న తేడా లేకుండా ఒకేలా ఉందని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తర్వాత చనిపోయిన వారి స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ కోల్పోయిన సర్పంచ్, వార్డు స భ్యుల స్థానాలన్నీ గతంలో వైసీపీ అభ్యర్థులు గెలిచిన స్థానాలే.  కానీ వాటిలో సగానికి పైగా స్థానాలలో వైసీపీ పరాజయం పాలైంది.   రాష్ట్రంలో 59 పంచాయతీల సర్పంచ్ లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ 28 పంచాయతీలను గెల్చుకుంది. వైఎస్ఆర్‌సీపీ 17 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు 12 చోట్ల విజయం సాధించారు. జనసేన రెండు గ్రామాల్లో తమ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిచారు.

ఇక పంచాయతీ వార్డుల్లో 485 వార్డులకు  ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకగ్రీవాలతో సహా తెలుగుదశం మొత్తం 189 వార్డుల్లో విజయం సాధించింది. వైసీపీ 177 స్థానాల్లో ఇండిపెండెంట్లు 100 స్థానాల్లో.. జనసేన, బీజేపీ అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధించారు. వైసీపీకి కంచుకోటల్లాంటి   గ్రామాల్లో సైతం  టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారంటే ఆ పార్టీ కోటలు ఎలా కూలిపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.  స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న అముదాల వలసలో బొప్పడం గ్రామ పంచాయతీని వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అది వైసీపీ సిట్టింగ్ స్థానమే. కానీ ఇప్పుడు అక్కడ టీడీపీ విజయం సాధించింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80శాతానికిపైగా సీట్లను కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక బయటపడేలా పంచాయితీ సర్పంచ్ లు, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాలు వచ్చాయి.  

ఇవి ఉపఎన్నికలు కాబట్టి అనివార్యంగా నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికే కాకినాడ కార్పొరేషన్ తో పాటు చాలా మున్సిపాలిటీల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి.ప్రభుత్వం వాటి జోలికి వెళ్లడం లేదు. టైమ్స్ నౌ వంటి సర్వేలను చూపి  తమకు ప్రజాదరణ తగ్గలేదంటూ చంకలు గుద్దుకుంటున్న వైసీపీకి ఈ పంచాయతీ ఉప ఎన్నికలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టణ ఓటర్లు జగన్ సర్కార్ ను ఛీ కొట్టారని తేలిపోయింది. పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలలో తెలుగుదేశం విజయ కేతనం ఎగురవేసింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కూడా తమ పార్టీ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం నిర్ద్వంద్వంగా రుజువు చేసింది.

ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే పల్లెలు కూడా ఫ్యాన్ గాలిని వద్దు పొమ్మంటున్నాయని తేలిపోయిది.  ఈ ఉప ఎన్నికలలో వైసీపీ ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో.. పోలీసులు ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో ఏలూరు జిల్లా వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి జరిగిన పోలింగ్ కళ్లకు కట్టింది. తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వీరమ్మకుంటకు రానివ్వలేదు. రౌడీషీటర్ వి నీకు ఇక్కడ ప్రవేశం లేదంటూ వెనక్కు పంపారు. అదే సమయంలో వైసీపీ మూకలు యథేచ్ఛగా వీరమ్మకుంట పోలింగ్ స్టేషన్ వద్ద వీరంగం చేశారు. ఇక పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలిలా ఉన్నాయి.  మొత్తం 485 వార్డు సభ్యుల ఎ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో   తెలుగుదేశం 189 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. వైసీపీ విజయం సాధించిన స్థానాలు 177 కాగా స్వతంత్రులు 100 వార్డులలో గెలుపొందారు. జనసేన, బీజేపీ కూటమి 19 వార్డులను కైవశం చేసుకుంది. 59 పంచాయతీలుకు ఎన్నికలు జరిగితే వాటిలో తెలుగుదేశం 28 స్థానాలలో గెలుపొందింది. వైసీపీ 17 స్థానాలలో, జనసేన, బీజేపీ కూటమి 2 స్థానాలలో విజయం సాధించగా ఇతరులు 12 స్థానాలను గులుచుకున్నారు.