బీఆర్ఎస్ లో భగభగలు.. కాక రేపుతున్న అసమ్మతి సెగ | sittings versus aspirants in brs| janagama| station| ghanpur| rajayya| tatikonda| mauttireddy| palla
posted on Aug 19, 2023 2:55PM
అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ లో ఒక్క సారిగా అసమ్మతి కాకరేగింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్గీయులు, స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరికి వ్యతిరేకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక నెహ్రూ పార్క్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పల్లా దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ముత్తిరెడ్డి వర్గీయులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు. కేసీఆర్ ఆశీస్సులు కూడా ఆయనకే ఉన్నాయన్న వార్తలు వినవస్తున్ననేపథ్యంలో ముత్తిరెడ్డి వర్గీయులు ఆందోళణ బాట పట్టారు. పల్లా గో బ్యాక్.. ముత్తిరెడ్డికే టికెట్ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే విధంగా స్టేషన్ ఘనపూర్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గీయులు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వలస నాయకుడు, దళిత దొర కడియం శ్రీహరి వద్దు.. స్థానిక నాయకుడు రాజయ్య ముద్దు అంటూ నినాదాలు చేసిన తాటికొండ వర్గీయులు ఒక దశలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా ఉండగా సిట్టింగులందరికీ టికెట్లు అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన నాటి నుంచి బీఆర్ఎస్ లో అసమ్మతి అగ్గికి అంకురార్పణ జరిగిందనే చెప్పాలి. సిట్టింగులందరికీ టికెట్ అన్న మాట కేసీఆర్ నోట వచ్చిన క్షణం నుంచీ పలు నియోజకవర్గాలలో అసమ్మతి భగ్గు మంది. దీంతో కేసీఆర్ వెనక్కు తగ్గారు.
తనకు అత్యంత నమ్మకస్తుడైన నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ద్వారా సిట్టింగులందరికీ కాదు.. కొందరికే అన్న సవరణ ప్రకటన చేయించారు. అయితే ఆ తరువాతి పరిణామాలలో చాలా నియోజకవర్గాలలో సిట్టింగులు, ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకుల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన బీఆర్ఎస్ అధిష్ఠానం బుజ్జగింపుల పర్వానికి తెరతీసినా, టికెట్ల ప్రకటన సమయం దగ్గరకొచ్చేసరికి అధిష్ఠానాన్ని కూడా లెక్క చేయని స్థాయికి అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజులలో ఈ అసమ్మతి జ్వాలలు మరిన్ని నియోజకవర్గాలకు విస్తరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.