కామారెడ్డి బరిలో రాములమ్మ.. కేసీఆర్ కు చుక్కలేనా? | vijayashanti to contest from kamareddy| kcr| gajwel| tw0o| seats| tight
posted on Aug 25, 2023 10:13AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విపక్షాలను డిఫెన్స్ లో పడేయాలన్న ఉద్దేశంతో సొంత పార్టీలో చెలరేగే అసమ్మతి జ్వాలల గురించి కూడా పెద్దగా పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు. మిగిలిన పార్టీల కంటే ముందుగా 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేసేశారు. తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లుగా కొన్ని నియోజవకర్గాలలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, అసమ్మతి జ్వాలలను చల్లార్చుకునే బాధ్యతను కూడా తాను ప్రకటించిన అభ్యర్థుల భుజస్కంధాలపైనే పెట్టేశారు.
టికెట్లు దక్కని అభ్యర్థులు ఇప్పటికే తమ దారి ఎటు అన్నది తేటతెల్లం చేసేశారు. రేఖా నాయక్ అయితే ఏకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు కూడా చేసేశారు. మరి కొందరు పార్టీ మారేందుకు రెడీ అయిపోయారు. ఈ వ్యవహారమంతా పక్కన పెడితే కేసీఆర్ స్వయంగా గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించేశారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ మొదలెట్టి.. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఒక చోటు కాదు ఏకంగా రెండు చోట్ల నుంచి పోటీ చేయడానికి కేసీఆర్ నిర్ణయించుకోవడంతోనే జాతీయ రాజకీయాలలో ఆయన పాత్ర నామమాత్రంగానే ఉండబోతున్నదని చెప్పకనే చెప్పేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు ఆయన పోటీ చేయనున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలు హాట్ సీట్లుగా మారాయి. గజ్వేల్ లో ఓటమి భయంతోనే ఆయన కామారెడ్డి నుంచీ కూడా పోటీలో దిగుతున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే గజ్వేల్ లో ఆయన ప్రత్యర్థిగా తాను నిలబడతాననీ, అందుకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తాననీ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ ప్రకటించేశారు. అసలు కేసీఆర్ మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి గజ్వేల్ లో ఈటల పోటీ సవాలే కారణమని పరిశీలకులు అంటున్నారు.
ఇక బీఆర్ఎస్ కు గట్టిపట్టున్న కామారెడ్డిని ఆయన ఎంచుకోవడంలోనే సేఫ్ గేమ్ ఆడుతున్నారని అవగతమైపోయిందని చెబుతున్నారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడకేం కాదని బీజేపీ అంటున్నది. కామారెడ్డిలో కేసీఆర్ కు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థిని రంగంలోనికి దింపాలని నిర్ణయించింది. ఆ బలమైన అభ్యర్థి మరెవరో కాదు రాములమ్మ విజయశాంతి అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఎలాగూ నిలబడతారు. ఇక ఇక్కడ బీజేపీ మాత్రం స్థానిక నేతలన కాదని విజయశాంతిని బరిలో నిలపాలని నిర్ణయించిందని చెబుతున్నారు. గతంలో మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి గెలిచిన విజయశాంతి మరోసారి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా అదృష్ఠాన్ని పరీక్షించుకోవాలని బావిస్తున్నప్పటికీ.. పార్టీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ కు ప్రత్యర్థిగా తాను రంగంలోకి దిగడం పై విజయశాంతి స్పందించారు.
తాను ఎక్కడ నుంచి పోటీలోకి దిగాలన్నది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కామారెడ్డి నుంచి పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే అక్కడ నుంచే రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. ఎవరిని ఎక్కడ నుంచి పోటీకి దించాలో అధినాయకత్వం నిర్ణయిస్తుంది, ఆ నిర్ణయాన్ని అంతా శిరసావహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆమె మాటలను బట్టి కామారెడ్డిలో కేసీఆర్ ను ఢీ కొనేందుకు ఆమె సానుకూలంగా ఉన్నారని చెప్పక తప్పదు.