వైసీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ? భారీ మార్పులు తప్పవా? | ycp candidates 1st list ready| heavy| changes| sittings| chance| limit| new| faces| winning
posted on Aug 25, 2023 4:56PM
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఒకేసారి తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల చేసి హీట్ పెంచేసిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో కూడా ఇప్పుడు ఎన్నికల మూడ్ మొదలయ్యేలా కనిపిస్తుంది. ప్రతిపక్షాలలో పొత్తుపై ఇంకా స్పష్టత రాలేదు. సాధ్యమైనంత త్వరగా ఈ పొత్తుల వ్యవహారాన్ని తేల్చాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయా పార్టీల ద్వారా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గెలుపు గుర్రాలెవరు అనే అంశంపై ఒకటికి ఐదారు సర్వేలు చేయించుకొని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. మరోవైపు గెలుపు అవకాశాలపై కూడా ఇప్పటికే కొన్ని సర్వేల ఫలితాలు వెలువడగా వీటిలో చాలా వరకు అధికార పార్టీకి ప్రతికూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. రెండు మూడు సర్వేల ఫలితాలైతే జగన్ మోహన్ రెడ్డి విజయానికి చాలా చాలా దూరం వెళ్లిపోయారని కూడా ఖరారు చేశారు.
ఒకవైపు అభ్యర్థుల పనితీరుపై వచ్చిన సర్వేల ఫలితాలు, మరోవైపు విజయావకాశాలపై వచ్చిన సర్వేల ఫలితాల ఆధారంగా వైసీపీ ఒక జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ జాబితాను సాధ్యమైనంత త్వరగా ప్రకటించే అవకాశాలున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని జగన్ భావిస్తున్నారంటున్నారు. జిల్లాల వారీగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసి వైసీపీ అభ్యర్ధులుగా ప్రకటించాలని చూస్తుండగా ఇప్పటికే ఒక జాబితా తుది దశకు చేరుకుందని అంటున్నారు. ఈ జాబితా ప్రకారం చూస్తే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండి చేయి తప్పదని తెలుస్తోంది. సీనియర్ నేతలని కూడా నిర్ధాక్షణ్యంగా జగన్ పక్కన పెట్టేశారని, ప్రజలలో అసంతృప్తి స్థాయి ఎక్కువగా ఉన్నవారిని, సర్వేల ఫలితంగా గెలుపు కష్టమేనన్న పీకే టీం అభిప్రాయం మేరకే ఈ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుస్తున్నది.
కాగా జిల్లాల వారీగా వైసీపీ సిద్ధం చేసిన ఫస్ట్ లిస్టులో ఉత్తరాంధ్ర నుండి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను తీసుకుంటే.. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, పలాస నుంచి సీదరి అప్పలరాజు, ఇచ్చాపురం నుంచి పిరియా విజయ, పాలకొండ నుంచి విశ్వసరాయి కళావతి, రాజాం నుంచి కంబాల జోగులును ఎంపిక చేయగా.. మిగిలినవి పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. విజయనగరం తీసుకుంటే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి పీడిక రాజన్నదొర, కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి, పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు, నెల్లిమర్ల నుంచి కడుబండి శ్రీనివాసరావు, గజపతినగరం నుంచి బొత్స అప్పలనరసయ్య ఫైనల్ కాగా మిగిలినవి పెండింగ్ ఉన్నాయి. ఇక విశాఖ జిల్లా తీసుకుంటే.. విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్, నార్త్ నుంచి కేకే రాజు, తూర్పు నుంచి ఎంవీవీ సత్యనారాయణ, వెస్ట్ నుంచి ఆడారి ఆనంద్ కుమార్, భీమిలీ నుంచి అవంతి శ్రీనివాస్, గాజువాక నుంచి తిప్పల దేవాన్ రెడ్డి, పెందుర్తి నుంచి అదీప్ రాజ్, అనకాపల్లి నుంచి గుడివాడ అమరనాధ్, ఎలమంచిలి నుంచి కన్నబాబురాజు, మాడుగుల నుంచి బూడి ముత్యాలనాయుడు, నర్శీపట్నం నుంచి పెట్ల ఉమా శంకర్, చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ, అరకు నుంచి శెట్టి ఫల్గుణ పేర్లు ఖరారైనట్లు తెలుస్తుంది.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి చూస్తే గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్, వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, నందిగామ నుంచి మేకతోటి జగన్మోహన్ రావు, మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు క్రిష్ణమూర్తి పేర్లు ఖరారు కాగా మిగిలినవి ఇంకా ఖరారు చేయలేదు. గుంటూరు జిల్లా తీసుకుంటే సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, పల్నాడు నుంచి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, గురజాల నుంచి కాసు మహేష్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక తాడేపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్థానంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ , ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత స్థానంలో ఆమె భర్త పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ ఒకరిద్దరి పేర్లు మాత్రమే ఖరారు కాగా మారుతున్న రాజకీయ సమీకరణాల ఆధారంగా ఇక్కడ భారీ మార్పులు ఉండనున్నట్లు చెప్తున్నారు.
అలాగే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో కూడా వైసీపీకి భారీ ట్రబుల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు జిల్లాలలో చాలా మంది నేతలు రెబల్స్ గా మారగా.. మరికొందరు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా నాలుగైదు స్థానాలను మాత్రమే ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అసలు రెండు మూడు స్థానాలలో అయితే గట్టి అభ్యర్థులే లేక తీవ్ర కసరత్తులు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక రాయలసీమలో అయితే భారీగా సిట్టింగులకే మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దమైన జగన్ ఒకటీ రెండు స్థానాలలో మాత్రమే మార్పులు చేపట్టనున్నారని తెలుస్తుంది. మరి వైసీపీ మొత్తం ఎన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది? అసంతృప్తులను ఎలా బుజ్జగించనుందన్నది చూడాల్సి ఉంది.