Leading News Portal in Telugu

పోర్ బందర్ నుంచి రాహుల్ రెండవ  జోడోయాత్ర …ఎన్డీయేకి ఇక వణుకు మొదలైనట్టేనా…?


posted on Aug 25, 2023 1:14PM

కాంగ్రెస్  అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి విడత భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ అయింది. ఆ యాత్ర ప్రభావం… అధికారమదంతో విర్రవీగుతున్న మోదీ ప్రభుత్వాన్ని… చావు దెబ్బ తినిపించి… కిందకు దించింది. ఆ సమయంలోనే … కర్ణాటక ఎలక్షన్లు రావడంతో… రాహుల్ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్  అద్భుతంగా పని చేసింది. బీజేపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. మొదటి విడత భారత్ జోడో యాత్రకు సీక్వెల్ గా… రాహుల్ గాంధీ రెండో విడత యాత్రకు సంసిద్ధులు అవుతున్నారు. 

వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర రెండవ విడతకు రంగం అంతా సిద్ధమైంది. అక్టోబర్ రెండవ తేదీన మహా త్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గుజరాత్ లో ఆయన జన్మించిన పోర్ బందర్ నుంచి యాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గుజరాత్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఎన్నికలు ముంచు కొస్తున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల మీదుగా సాగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ జిల్లాలో పరశురామ్ కుండ్ వద్ద ముగుస్తుంది. అయితే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే తెలంగాణ మీదుగా యాత్ర సాగే విషయమై ఇంకా ఒక స్పష్టత రాలేదని తెలిపాయి. రాహుల్ గాంధీతోపాటుగా ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను సంప్రందించిన అనంతరం పార్టీ అగ్రనేతలు జేసీ వేణుగోపాల్, జైరామ్ రమేశ్, తదితరులు యాత్ర మార్గాన్నిఖరారు చేస్తారని సమాచారం. తొలుత యాత్రను గువాహటిలో కామాఖ్య దేవి  దేవస్థానం వద్ద ముగించాలని భావించారు. అయితే మణిపూర్ లో సంక్షోభంతో సదరు ప్రతి పాదనను విరమించుకున్నారు. రెండవ విడత భారత్ జోడో యాత్ర నాలుగు నెలల పాటు సాగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య భారతానికి కుంబ్షా పేరుగాంచిన పరశురామ్ కుంద్ మేళా జనవరిలో మకర సంక్రాంతి సమయంలో జరుగుతుంది. మేళాకు దేశం నలుమూలాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివస్తారు. పరశురామ్ కుండ్ మేళా వద్ద భారత్ జోడో యాత్ర ముగుస్తుందని యాత్రను ఖరారు చేసి పనిలో ఉన్న కీలకమైన కాంగ్రెస్ నేతల నుంచి అందిన సమాచారం. గడచిన దశాబ్దాల్లో ప్రజలతో మమేకం కావడంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అత్యంత విజయవంతమైన కార్యక్రమంగా భారత్ జోడో యాత్ర నిలిచిందని చెప్పవచ్చు. తొలి విడత యాత్ర కర్నాటకలో 21 రోజులపాటు సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక గ్రామాలను, పట్టణాలను, నగరాల గుండా కొనసాగింది. ఆ క్రమంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ కూడా  ఉందనేది సత్యం. రెండో విడత యాత్ర కూడా సక్సెస్ అయితే…. ఇక ఎన్డీయేకి బ్యాడ్ టైం మెదలైనట్లేనని రాజకీయ పండితుల విశ్లేషణ.