కాళ్లు మొక్కినా ఫలితం లేకపోయే.. హెల్త డైరెక్టర్ కు కేసీఆర్ రిక్తహస్తం! | kcr ignore health director political drem| kottagudem| ticket| vanama
posted on Aug 25, 2023 11:08AM
తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు.. ఒక అధికారిగా ఆయన ప్రతిభ, పని తీరు సంగతి ఏమో కానీ.. రాజకీయ ఆశావహుడిగా మాత్రం ఆయన రాష్ట్రంలో సుపరిచితుడు. కొత్తగూడెం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు.. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గా తన హోదాను, పరపతిని కేసీఆర్ కాళ్ల దగ్గర పడేశారు. పలుమార్లు ఆయన కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు. పలుమార్లు రాజకీయ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన ఇవన్నీ తన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికే చేశారనడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు.
అధికారిగా తన పరిధులు మీరి మరీ ఆయన చేసిన విన్యాసాలు చివరికి ఆయన ఆశించిన ఫలితాన్ని ఇచ్చాయా? ఆయన కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న కోరికకు కేసీఆర్ ఆమోదముద్ర వేశారా అంటే అదేం జరగలేదు. పాపం శ్రీనివాస్ కేసీఆర్ లైట్ గా తీసుకున్నారు.
ఇంతోటి దానికి ఆయన అధికారిగా పలుచన అయ్యారు. తన స్థాయిని మరిచి కాళ్లు మొక్కారు. భట్రాజును తలదన్నేలా నేతలను పొగడ్తలలో ముంచెత్తి నవ్వుల పాలయ్యారు. సరే అసలు విషయానికి వస్తే..
వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ నిత్యం వివాదాలతో వార్తలలో ఉంటూ వచ్చారు. ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయన్న వివాదాస్పద వ్యాఖ్యల నుంచి.. పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కడం వరకూ ఆయన ఏం చేసినా కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ కోసమేనని అప్పట్లోనే పరిశీలకులు పలు ఉదాహరణలతో విశ్లేషణలు చేశారు. అలాగే రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని తనను తాను మరచి మరీ పొగడ్తల వర్షం కురిపించేశారు. హరీష్ సిద్ధిపేటకు చేసిన దానిలో సగంపనులు చేసినా కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆయన ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ అప్పట్లో నెటిజన్లు ఏకి పారేశారు.
గడల శ్రీనివాసరావు కరోనా సమయంలో కరోనా కేసులు, చికిత్స పొందుతున్నవారు, మరణించినవారు.. ఇలా నిత్యం లెక్కలు చెప్పడానికి మీడియా ముందుకొచ్చేవారు. ఆయన లెక్కలన్నీ తప్పులతడకని పలుమార్లు హైకోర్టు చేత తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆయనా చీవాట్లు తిన్నారు. కరోనా లెక్కలతో మీడియాలో పాపులరైన (అప్రతిష్ట పాలైన) గడల శ్రీనివాసరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందినవారు. మీడియాలో పాపులర్ కావడం ద్వారా రాజకీయాలలో రాణించాలని తహతహలాడారు. అంతేనా తరచూ కొత్తగూడెంలో పర్యటించడం, ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించడం, పర్యవేక్షించడంతో ప్రాచుర్యం పొందేందుకు ప్రయత్నించారు. కొత్తగూడెం నుంచి బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేది కూడా తానేనంటూ పలుమార్లు ప్రకటనలు సైతం చేశారు. ప్రచారం కూడా చేసుకున్నారు. కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడి వ్యవహారంలో వివాదాస్పదం కావడం, ఎన్నికల సమయంలో వేసిన అఫడివిట్ లో తప్పుల కారణంగా తెలంగాణ హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించడం వంటి కారణాలతో కొత్తగూడెం అభ్యర్థిని తానేనని గడల శ్రీనివాసరావు ఫిక్సైపోయారు. వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర విమర్శలు కూడా సంధించారు. ఇదే సమయంలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించేశారు. కట్ చేస్తే.. ఆశల పల్లకీలో ఊరేగిన ఆయన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత బొక్కబోర్లా పడ్డారు. ఆ జాబితాలో శ్రీనివాసరావు పేరు లేదు. మళ్లీ బీఆర్‌ఎస్ టికెట్ నున వనమా వెంకటేశ్వరరావుకే కట్టబెట్టారు. దీంతో తానే అభ్యర్థినని చెప్పుకుంటూ వచ్చిన గడల కంగు తిన్నారు. మీడియాకే కాదు.. ఎవరికీ ముఖం చూపకుండా సైలెంటైపోయారు.