Leading News Portal in Telugu

ఓట్ల తొలగింపుతో విజయం.. జగన్‌ను భ్రమల్లో ముంచేశారా? | jagan in illusion| win| votes| remove| sajjala| plan| counter


posted on Aug 25, 2023 6:18AM

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. అధికార పార్టీ నేతలు ఎక్కడకి వెళ్లినా చెప్పిందేంటి? చేసిందేంటి? అంటూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన గడపగడప కార్యక్రమం పుణ్యమా అని ఈ అసంతృప్తిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చూశారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఎక్కడ సభలు పెట్టినా తండోపతండాలుగా ప్రజలు పోగవుతున్నారు. ర్యాలీలు పెడితే పెద్దఎత్తున వెళ్లి మద్దతు తెలుపుతున్నారు.  ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుపడుతున్నారు. రాష్ట్రంలో నాశనమైన వ్యవస్థల నుండి నశించిపోయిన అభివృద్ధి వరకూ ఒక్కొకటి తూర్పార పడుతూ ప్రజలలోకి దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేతలు ఇంతగా విమర్శిస్తున్నా వైసీపీ నేతల నుండి ఉలుకూ పలుకూ లేదు. విమర్శలను ఖండించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నేతలు తిరిగి ప్రతిపక్ష నేతలను మీరేం చేశారో చెప్పాలని అర్ధం పర్ధం లేని డిమాండ్లు చేస్తున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సినారియోను చూస్తే అధికార వైసీపీ పార్టీ హ్యాండ్సప్ చెప్పినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అంతకు ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే వంద బూతులు మాట్లాడే నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. తత్వం బోధపడే ఇలా సైలెంట్ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే  సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ తనదే విజయమని నమ్ముతున్నారని, మరోసారి తానే సీఎం అవుతారని ధీమాగా ఉన్నారని కొందరు పరిశీలకులు బలంగా విశ్లేషిస్తున్నారు. తాను తెచ్చిన సంక్షేమ పథకాలే తనను మరోసారి అందలం ఎక్కిస్తాయని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు వైసీపీ  వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే, జగన్ చుట్టూ చేరిన కోటరీనే ఆయన్ను   భ్రమల్లో ఉంచుతున్నదనీ, ఆయనను ఓ దైవాంశ సంభూతుడిగా చూపిస్తూ.. తాను తలచుకుంటే కానిది లేదన్న ధోరణితో ఆయనను ఒక ట్రాప్ లో ఉంచేసినట్లు కనబడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని టక్కుటమార విద్యలతో గట్టెక్కే ప్రణాళికలు రచిస్తూ దాన్ని జగన్ ఛరిస్మాగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో అధికారులపై వేటు పడిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారనే అభియోగాలపై అనంతపురం జిల్లా జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిబంధనలు పాటించకుండా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారంటూ గత కొంత కాలంగా టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో ఈసీకి చెందిన అధికారులు అనంతపురం జిల్లా ఉరవకొండలో నేరుగా క్షేత్ర స్థాయి పర్యటన సైతం నిర్వహించి అధికారిపై వేటు వేశారు. అనంతపురం అధికారి ఒక్కడే కాదు అక్రమంగా ఓట్లను తొలగించడంపై మరికొందరు అధికారులు కూడా బలి పశువులు కావడం ఖాయమని తేలిపోయింది.

ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని వైసీపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగిస్తుందని స్పష్టంగా ఈసీనే ఒక నిర్ణయానికి వచ్చి అధికారులపై వేటు వేస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు. తనది కాకపోయినా అన్ని శాఖలకు సంబంధించిన అంశాలపై మైకు ముందుకొచ్చే సలహాదారు సజ్జల రామకృష్ణ ఈ విషయంలో కూడా మీడియా ముందుకొచ్చారు. ఇంకేముంది యధావిధిగా ఇది కూడా చంద్రబాబు పనేనని.. చంద్రబాబు ఈసీని మ్యానేజ్ చేసి అధికారులపై చర్యలు తీసుకొనేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మేము తొలగించింది దొంగ ఓట్లు మాత్రమేనని.. చంద్రబాబే వ్యవస్థలను మ్యానేజ్ చేసి వైసీపీ వారి ఓట్లను తొలగించారని కూడా ఆరోపించారు. తాము అరవై లక్షల దొంగ ఓట్లు గుర్తించామని.. వాటిని తీసేస్తే తాము అనుకున్న ఫలితం వస్తుందని.. అదే అసలైన ఫలితమని కూడా సెలవిచ్చారు.

మొత్తంగా ఈ ఓట్ల తొలగింపు, సజ్జల చెప్పిన థియరీ చూస్తే ఒక్కటి స్పష్టమవుతుంది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి తాము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డిని ఆయన నమ్మించినట్లు కనిపిస్తున్నది. అందుకే సజ్జల వాటిని తీసేస్తే తాము అనుకున్న ఫలితం వస్తుందని నిర్మొహమాటంగా చెప్తున్నారు. ఈ కుట్ర సిద్దాంతాన్ని అడ్డం పెట్టుకొనే ఎలాగైనా గెలుస్తామని ధీమాగా ఉన్నారని.. అదే భ్రమల్లో సీఎంను కూడా ఉంచేసి ఉంటారని రాజకీయ వర్గాలు అబ్బీప్రాయపడుతున్నాయి. అయితే, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కనుక న్యాయం నాలుగు కాళ్ళ మీద నడుచుకుంటూ వస్తుందనే సూత్రం మర్చిపోయినట్లున్నారు.