Leading News Portal in Telugu

టీటీడీ పాలకమండలా నిందితుల పునరావాస కేంద్రమా? | ttd board members appointment attract criticism| saratchandrareddy


posted on Aug 26, 2023 2:55PM

తెలిసే చేస్తున్నారో లేక కావాలనే కించపరిచేలా చేస్తున్నారో.. ప్రజలంటే చేతకాని వారికింద జమకట్టేసి పెత్తనం చెలాయిస్తున్నారో కానీ కలియుగ   దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం విషయంలో ఏపీ ప్రభుత్వం లెక్కలేని తనంగా నిర్ణయాలను తీసుకుంటున్నది. తాజాగా టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే ఆ స్థానంలో భూమన కరణాకర రెడ్డిని కూర్చోబెట్టారు. ఈ సేవా పదవి కోసం ఎంతో మంది పడిగాపులు కాస్తుండగా భూమనకు రెండోసారి ఈ పదవిని కట్టబెట్టారు. ఈ నియామకం తీవ్ర వివాదాస్పదం అయింది.  నాస్తికుడైన భూమనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తాయి. అదలా ఉండగానే భక్తులపై చిరుతల దాడులు, నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం, భక్తుల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తగా.. కాలినడకన వెళ్లే భక్తులకు ఊత కర్రలు ఇచ్చి క్రూర మృగాలను తరమడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి.

అదలా ఉండగానే ఇప్పుడు టీటీడీ పాలక మండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం( ఆగస్టు 25)  రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 24 మందిలో కొత్తగా 18 మంది కొత్త సభ్యులు నియమితులు కాగా,  ఆరుగురు పాతవారినే కొనసాగించింది. ఈ నూతన పాలక మండలిలో మహారాష్ట్ర నుంచి ముగ్గురిని తీసుకోగా.. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి ఇద్దరికి  అవకాశం దక్కింది. ఈ బోర్డులో ఎమ్మెల్యే కోటాలో పోన్నాడ సతీష్, సామినేని ఉదయభాను, తిప్పేస్వామికి అవకాశం దక్కగా.. తెలంగాణ నుంచి శరత్ చంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రంజీత్ కుమార్ సతీమణి సీతారెడ్డికి చోటు దక్కింది. కడప నుంచి మాసీమ బాబు, యానదయ్య, కర్నూలు నుంచి సీతారామిరెడ్డి, గోదావరి జిల్లా నుండి సుబ్బారాజు, సిద్దారాఘరావు కుమారుడు సుధీర్, అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ పేర్లు ఉన్నాయి. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా, మిలింద్ నర్వేకర్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండేకు అవకాశం కల్పించారు. 

అయితే, జగన్ సర్కార్ ప్రకటించిన ఈ నూతన పాలక మండలిలో ఇద్దరికి అవకాశం ఇవ్వడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వారిలో ఒకరు డిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టై, అప్రూవర్‌గా మారి బెయిలుపై వచ్చిన శరత్‌చంద్రారెడ్డి, మరొకరు 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడి అరెస్టై ఉద్వాసనకు గురైన  యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్. వీరిరువురినీ టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడంతో టీటీడీ దొరికిపోయిన దొంగలకు పునరావాస కేంద్రంగా మారిందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితుడైన శరత్ చంద్రరెడ్డి లిక్కర్ స్కాంలో అరెస్టైన సైంగతి తెలిసిందే. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రరెడ్డి వైసీపీ ఎంపీ విజసాయిరెడ్డి అల్లుడి సోదరుడు.  ఢిల్లీ లిక్కర్ కేసులో  అరెస్టై, ఈ తరువాత అప్రూవర్ గా మారడంతో బెయిలు లభించి బయటకు వచ్చారు.  

ఇక పోతే వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ పూర్తిగా శరత్ చంద్రారెడ్డి చేతుల్లోకి వెళ్లగా అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ఆ తర్వాత కూడా శరత్ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అయిన అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కట్టబెట్టారు. కాగా ఇప్పుడు ఏకంగా అతి పవిత్రమైన టీటీడీ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరుగా కూడా నియమించారు. ఏ ప్రాతిపదికన ఈయనను నియమించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కేసులో అప్రూవర్‌గా మారాడమంటే నేరం అంగీకరించినట్లే అర్ధం. అలాంటి నేరస్తుడికి మళ్లీ కోర్డు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపిస్తే, స్వామివారి పవిత్రతకు అర్ధం ఏముంటుందని భక్తులు నిలదీస్తున్నారు. 

ఇక 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడి అరెస్టై ఉద్వాసనకు గురైన  యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్ కి కూడా వైసీపీ ముఖ్యమంత్రి జగన్  టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఆయనపై నేరారోపణలు ఉన్నాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చారు. అయినా డాక్టర్ కేతన్ దేశాయ్ కి టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అవకాశం లభించడానికి కారణం ఆయన స్వస్థలం గుజరాత్ కావడమేనా అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన భారీ అవినీతికి పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థ  సీబీఐ తేల్చిన కేతన్ దేశాయ్ ని అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో చోటు కల్పించడం ఏంటంటూ కొంతమంది ప్రశ్నిస్తుండగా.. తాజాగా ఈ అంశం సోషల్ మీడియాలోనూ చర్చనియాంశమైంది. గుజరాత్‌లో మెడికల్ సీట్ల వ్యవహారంలో.. అక్రమాలకు పాల్పడిన దేశాయ్‌ను వెతికి మరీ టీటీడీ పాలకవర్గంలో నియమించడం సిగ్గుచేటని భక్తులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రాజకీయ నిరుద్యోగులను చట్టసభలకు నామినేట్ చేసినట్లు కళంకితులను తీసుకొచ్చి ఆశ్రయం కల్పించడానికి  టీటీడీని అపవిత్రంగా మార్చేస్తున్నారని జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.