వైసీపీ బస్సుయాత్ర.. మరో పరాభవం తప్పదా? | ycp bus yatra ready to face another failure| gadapagadapaku| maa| nammakam| nuvve| jagan| people| protest
posted on Aug 27, 2023 10:08AM
ఏపీలో వైసీపీకి ఉక్కపోత మొదలైంది. ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నది. కుంటుపడిన అభివృద్ధి, నెరవేరని హామీలు, కక్ష పూరిత రాజకీయాలు, పన్నుల బాదుడు, పెరిగిన ధరలు, భూ కబ్జాలు, నేతల రౌడీయిజం, ఎదిరించిన వారిపై బెదిరింపులు ఇలా ఒక్కటేమిటి అన్నీ కలిసి ఇప్పుడు ప్రజలలో వైసీపీ నేతలు పలుచన అయిపోయారు. ప్రశాంతంగా జీవనం సాగించాల్సిన ప్రజలు శాంతిభద్రల లేమితో బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన రావడం, అభివృద్ధి కుంటుపడి ఉపాధి కరవై వలసలు అనివార్యం కావడంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు తమకు అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో ప్రజలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారు. నాలుగేళ్ళలో చేసిందేంటని ప్రజలు నిలదీస్తుండడంతో వైసీపీ నేతలు సహనం కోల్పోతున్నారు. దీంతో కొందరు వైసీపీ నేతలు ప్రజలపై చిందులేయడంతో ప్రజలు వెనకా ముందు లేకుండా కడిగిపారేస్తున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గడపగడపకు ప్రభుత్వం, ఏపీ నీడ్స్ జగన్ లాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికీ ఈ కార్యక్రమాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. అయితే, పలు చోట్ల ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు మొహం చాటేశారు. ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన నేతలు ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమాలను మమా అనిపించేశారు. కాగా, ఇప్పుడు సీఎం జగన్ మరో కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. పాజిటివ్ నెగటివ్ ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చినా ఇందుకోసం వంద రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ బస్సు యాత్రగా దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తున్నది.
వైసీపీ ఈ వంద రోజుల బస్సు యాత్రను ఏ జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుల అధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంచార్జిలు అందరూ పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. బస్సుయాత్ర ద్వారా అందరు వైసీపీ నేతలు నియోజకవర్గాలను చుట్టేసి అన్ని వర్గాలను కలవాలన్నది ఆలోచన. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను దగ్గర నుండి ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారాలను కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం కోసమే ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం నుండి వంద రోజుల పాటు నేతలంతా ప్రజలలో ఉండాలని.. ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే కఠిన నిర్ణయాలకు వెనకబడబోమని వైసీపీ పెద్దల నుండి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తున్నది. ప్రజల స్పందనను కూడా ముందే ఊహించిన కార్యక్రమ రూపకర్తలు.. ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చినా కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరాల్సిందేనని డిసైడ్ చేశారట.
అయితే, ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలకు మరో సినిమా తప్పదా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. కేవలం ప్రజల నుండి మాత్రమే కాదు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నేతలలో కూడా కొందరు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఎవరితో ఎలాంటి అవసరం లేకుండా బటన్ నొక్కి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుండగా.. అభివృద్ధి పనులపై ప్రజల నుండి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని.. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు కావడం లేదని, చేసిన పనులకు కూడా బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయామని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులలో వారి వద్దకు వెళ్తే స్పందన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరోవైపు ఈ బస్సు యాత్ర జిల్లా అధ్యక్షుల చేతుల మీదగా జరగాలని ఆదేశించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులతో పాత నేతలకు ఇంకా సమన్వయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షులు పెత్తనం చెలాయించడం పాత నేతలు ఎలా తీసుకుంటారన్నది పలు అనుమానాలకు తావిస్తుంది. పలు ప్రభుత్వ వర్గాలలో కూడా ప్రభుత్వంపై పీకల వరకు కోపం దాగి ఉంది. నిధుల కొరతతో బిల్లులు రాక.. స్థానిక నేతల నుండి తీవ్ర ఒత్తిళ్లు ఉండగా.. ఇప్పుడు అక్కడిక్కడే ఎమ్మెల్యేలు సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలివ్వనున్న నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ప్రశ్నార్ధకమే. మొత్తంగా చూస్తే ఘోర విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్తే ఏమవుతుందన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది.