గన్నవరంపై వైసీపీ ఆశలు వదిలేసుకున్నట్లేనా? | ycp lost hopes on gannavaram| vallabhaneni| vamshi| yarlagadda| dutta| balasourie| anti| incumbancy
posted on Aug 28, 2023 7:04AM
నడమంత్రపు సిరి ఎక్కువ కాలం నిలవదనే సామెత అందరికీ తెలిసిందే. అదే రాజకీయాలలో అయితే అనుకోకుండా కలిసి వచ్చిన నాయకత్వ అవకాశం కూడా ఎక్కువ కాలం నిలవదు. ఈ మాట గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సరిగ్గా సరిపోతుంది. వంశీ ఏమీ విద్యార్థి స్థాయి నుండి ఎదిగిన నేత కాదు.. వాళ్ళ కుటుంబం కూడా రాజకీయాలలో ఉన్న దాఖలాలు లేవు. కానీ, దివంగత నేత పరిటాల రవి పుణ్యమా అని.. హీరో నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో ఈజీగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కించుకున్నారు. స్వతహాగా తెలివితో పాటు కొంత ఆర్ధిక పుష్టి కూడా ఉండడం.. యువకుడు కావడంతో పార్టీ అధినాయకత్వం కూడా ఎంకరేజ్ చేసింది. కానీ, ఉన్న తెలివికి తోడు రాజకీయంగా కలిసి రావడంతో ఆ తెలివి కాస్త అతి తెలివిగా మారింది. రాజకీయంగా ఓనమాలు నేర్పిన పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని నోటికి వచ్చినట్లు దూషిస్తూ తానే హీరో అనుకుని చెలరేగిపోయారు. ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఆ పార్టీ బీఫామ్ కారణమే సంగతి మరచి ఆ పార్టీ పెద్దలను వ్యక్తిగతంగా కూడా తూలనాడారు.
ప్రస్తుతం అనధికారకంగానైనా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ.. వచ్చే ఎన్నికలలో అదే గన్నవరం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా దాదాపు ఖాయమే. ఇంతవరకూ వంశీకి బాగానే కలిసి వచ్చినా ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అనే చర్చ రాజకీయ వర్గాలలో మొదలైంది. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆయన స్థానికంగా ప్రదర్శించిన దూకుడే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రశ్నార్ధకంగా మారినట్లు కనిపిస్తుంది. గతంలో 2014, 2019 ఎన్నికలలో టీడీపీ నుండి గెలిచిన వంశీ స్థానిక వైసీపీ నేతలపై తీవ్రమైన దూకుడు ప్రదర్శించారు. అడ్డు తగిలిన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం.. అనుచరులతో బెదిరించడం వంటి చేష్టలకు పాల్పడ్డారని ఇప్పుడు ఆయనున్న పార్టీ వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా చెప్తున్నారు. అప్పట్లో తెలుగుదేశం అధినాయకులు మందలించినా ఖాతరు చేసేవారు కాదన్న ప్రచారం కూడా ఉంది. అప్పుడు వంశీ వేధింపుల బాధితులైన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు గన్నవరంలో ఆయన నాయకత్వాన్ని సహించలేకపోతున్నారట.
ఇప్పటికే ఇక్కడ వైసీపీ ఇంచార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన యార్లగడ్డతో గత ఎన్నికలలో భారీగా ఖర్చు పెట్టించిన వైసీపీ ఇప్పుడు వంశీని చేర్చుకొని యార్లగడ్డను ముంచేసింది. ఈ క్రమంలోనే అతను టీడీపీలో చేరిపోయారు. అంతకు ముందు 2014 ఎన్నికలలో వంశీపై పోటీ చేసిన వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు కూడా ఇప్పుడు వైసీపీని వీడడం ఖాయంగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతున్నది. వంశీ నాయకత్వంలో పనిచేసేందుకు వైసీపీ కార్యకర్తలెవరూ ఇష్టపడడం లేదని దుట్టా బహిరంగంగా, బాహాటంగా చెప్తున్నారు. దుట్టా కూడా పార్టీని వీడితే నష్టమని భావించిన వైసీపీ అధిష్టానం మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని రాయబారానికి పంపింది. దుట్టా ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన బాలసౌరి.. దుట్టా వైసీపీకి విధేయుడని గన్నవరంలో పార్టీ విజయానికి పని చేస్తారని చెప్పుకొచ్చారు.
కానీ భేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు మాత్రం మరోలా మాట్లాడారు. మూడు నెలల క్రితమే సీఎం జగన్ తనను పిలిచి నియోజకవర్గ పరిస్థితి గురించి అడిగారని.. అప్పుడే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా సీఎంకు చెప్పానని.. ఈరోజు కూడా బాలశౌరితో అదే విషయాలు చెప్పానని అన్నారు. వంశీతో కలిసి పనిచేస్తానని మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కాస్త ముందో వెనకో ఆయన కూడా పార్టీని వీడడం ఖాయం అనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ వైసీపీలోనే ఉన్నా వంశీ కోసం పనిచేయరన్నది మాత్రం స్పష్టమైపోయిందని చెబుతున్నారు. అలాగే పార్టీలో నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నేతలు కొందరు యార్లగడ్డతో వెళ్లిపోగా.. ఉన్న వారు వంశీ కోసం పనిచేసే పరిస్థితిలో లేరు. దీంతో ఇప్పుడు వంశీతో ఆయనతో పాటు టీడీపీ నుండి వచ్చిన వారే కనిపిస్తున్నారు. గత ఎన్నికలలో 838 ఓట్లతో గెలిచి బయటపడిన వంశీ ఈసారి వ్యక్తిగత వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైతే గెలవడం అసంభవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.