Leading News Portal in Telugu

ఎన్టీఆర్ స్మారణ నాణెం ఎక్కడ తయారైందదో తెలుసా?.. దీని వెల ఎంతంటే? | ntr commemorative coin made in hyderabad| cost| family| members| draupadi


posted on Aug 28, 2023 4:08PM

స్మారక నాణెం అనేది ఒక సంఘటన, మహోన్నత వ్యక్తి లేదా చిరస్మరణీయమైన మైలురాయిని గౌరవించుకోవడానికి  జారీ  చేస్తారు. ఆలా జారీ చేసిన నాణేలను  సాధారణ చలామణిలో ఉపయోగించరు. వీటిని కేవలం ముద్రించి సేకరణ వస్తువులుగా విక్రయిస్తారు. వీటిని జనం కొనుక్కుని అపురూపంగా దాచుకుంటారు.  అలాంటి అపురూపమైన వ్యక్తి కనుకనే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రూపొందించింది. ఈ నాణెం సోమవారం (ఆగస్టు 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.

ఈ శతాబ్దం ఎన్టీఆర్ ది అని ప్రతి తెలుగువాడూ గర్వంగా చెప్పుకోదగ్గ మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్ ది. సినీ, రాజకీయ రంగాలలో అనితర సాధ్యమని చెప్పదగ్గ ఘనతలు సాధించిన ఎన్టీఆర్ స్మృత్యర్థం విడుదల చేసిన స్మారణ నాణెం ఎక్కడ తయారైందో తెలుసా. ప్రతి తెలుగువాడూ గర్వించదగ్గ ఎన్టీఆర్ స్మారణ నాణేన్ని తెలుగుగడ్డపైనే తయారు చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో   తయారైంది. ఒక వ్యక్తి పేరు మీద విడుదలైన నాణెం హైదరాబాద్  మింట్ లో తయారవ్వడం ఇదే మొదటి సారి.   తొలి విడతలో 12 వేల స్మారక నాణేలు ముద్రించారు. దీని ముఖ విలువ వంద రూపాయలే అయినా.. దీనిని సొంతం చేసుకోవాలంటే  రూ. 4,160 చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది.  అయితే  డిమాండ్‍కి తగినంతగా నాణేల సరఫరా లేదు.  ఈ రూ.100 నాణెం 44 మిమీ వ్యాసం కలిగి ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో రూపొందించబడింది. దీన్ని ఏదైనా బ్యాంకులో లేదా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ. 4,160 ఉంటుంది.  

నాణెంతో పాటు, తెలుగు ప్రైడ్‌గా పేరొందిన ఎన్టీఆర్‌ చరిత్రాత్మక జీవిత ప్రయాణాన్ని వివరించే నాలుగు పేజీల పుస్తకాన్ని కూడా  కొనుగోలుదారులకు ఈ నాణెంతో పాటు  అందిస్తారు. నాణేనికి ఒకవైపు మూడు సింహాలు, అశోకచక్రం ఉండగా, మరో వైపు హిందీలో  నందమూరి తారక రామారావు శతజయంతి’ అని చెక్కబడిన ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సూచించేందుకు నాణెం 1923-2023 అని కూడా ఉంటుంది.

ఈ నాణాన్ని హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే ముద్రించబడటం విశేషం. అయితే 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యునే ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.  NTR రూపంతో నాణెం ముద్రించడం పట్ల నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాణెం విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.