జగన్ పక్కన పెట్టేశారా?.. వంశీ కొంపమునిగినట్లేనా? | vamshi sidelined by jagan| gannavaram| dutta| ycp| candidate| yarlagadda
posted on Aug 28, 2023 12:33PM
అలా వైసీపీకి రాజీనామా చేసి.. ఇలా తెలుగుదేశంలో చేరగానే యార్లగడ్డ వెంకట్రావ్‌ని గన్నవరం పార్టీ ఇన్‌చార్జీగా తెలుగుదేశం అగ్రనాయకత్వం నియమించేసింది. దీంతో యార్లగడ్డ.. త్వరలో గన్నవరం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే నియోజకవర్గంలో పలు మండలాల్లోని వైసీపీ శ్రేణులు.. గన్నవరం వచ్చి మరీ.. వెంకట్రావ్ సమక్షంలో పసుపు పార్టీ తీర్థం పుచ్చేసుకుంటున్నాయి.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరు? వల్లభనేని వంశీనా? లేక దుట్టా రామచంద్రరావా? అనే ఓ చర్చ నియోజవకర్గంలో జోరందుకుంది. కారణమేమిటంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దుట్టా రామచంద్రరావుని బరిలోకి దింపేందుకు ఆ పార్టీ ధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌లో గన్నవరం నియోజకవర్గ నేత దుట్టా రామచంద్రరావుతోపాటు ఆయన కుమార్తె, అల్లుడు.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గన్నవరం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని నిలబెడతామంటూ దుట్టా రామచంద్రరావుకు జగన్ హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అందుకే సీఎం జగన్‌తో భేటీ అనంతరం దుట్టా రామచంద్రరావు.. మీడియాతో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారంటున్నారు.
మరోవైపు రానున్న ఎన్నికల్లో గన్నవరం ఫ్యాన్ పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీనే అంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే నియోజకవర్గంలో కొన సాగుతోంది. కానీ నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేల నివేదికను ఇప్పటికే ఐ ప్యాక్.. జగన్‌కు అందించిందనీ, ఆ నివేదికల ప్రకారం.. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం అవ్వడంలో రానున్న ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే.. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపు నల్లేరు మీద నడకే అవుతోందని సీఎం భావిస్తున్నారనీ, అందుకే ఆయన దుట్టా రామచంద్రరావు వైపే మొగ్గు చూపుతున్నారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
ఇక ఎన్నికలు జరగనున్న కొద్ది రోజుల ముందు.. నీవు గెలువవంటూ ఐ ప్యాక్ నివేదిక ఇచ్చింది ఏం చేద్దాం నీవే చెప్పు అంటూ వల్లభనేని వంశీని జగన్ పక్కన పెట్టేయడం ఖాయమంటున్నారు.
అదీకాక.. గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్ర రావు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉన్నాయని…. అలాగే ఆయన అల్లుడు శివభరత్‌రెడ్డి.. సీఎం జగన్ భార్య భారతి సమీప బంధువన్న సంగతి అందరికీ తెలిసిందేనని… అయితే గత ఎన్నికల వేళ.. గన్నవరం టికెట్ కోసం శివభరత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని… కానీ నాడు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్‌ను ఆ పార్టీ అధినేత జగన్ ఎంపిక చేయడంతో.. ఈ సారి శివభరత్‌రెడ్డికి టికెట్ ఇస్తే.. వల్లభనేని వంశీని మోసం చేసినట్లు అందరికీ క్లియర్‌కట్‌గా అర్థమైపోతుందని.. అందుకే మద్యే మార్గంగా దుట్టా రామచంద్రరావుని గన్నవరం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపనున్నారన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. అంతేకాకుండా గెలిపించిన పార్టీపై రాళ్లు వేసి.. జగన్‌ని మనసా వాచా కర్మణా నమ్మి వెళ్లిన వల్లభనేని వంశీని జగన్ నిలువునా ముంచేసేలా ఉన్నారని వంశీ అనుచరులు సైతం ఆందోళన చెందుతున్నారు.