Leading News Portal in Telugu

అదానీ గ్రూపు నిబంధనల ఉల్లంఘన వాస్తవమే.. సెబీ దర్యాప్తులో వెల్లడి | adani group violations true| sebi| investigation


posted on Aug 29, 2023 8:47AM

అదానీ గ్రూప్ పై హిడెన్ బర్గ్ నివేదికలోని అంశాలు అక్షర సత్యాలని తేలిపోయింది. అమెరికా స్థావరంగా పని చేస్తున్న పట్టుమని పది మంది  సిబ్బంది లేని షార్ట్ సెల్లర్ స్టాక్ బ్రోకర్ సంస్థ హిడెన్ బర్గ్ నివేదిక ఆధారంగా  నిందలు వేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆదాని ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉన్నారు. ఔను హిడెన్ బర్గ్ నివేదిక లోని అంశాలు వాస్తవమేనని, అదానీ గ్రూపు కంపెనీలు అవకతవకలకు పాల్పడ్డాయనీ సెబీ దర్యాప్తు బట్టబయలు చేసింది. హిడెన్ బర్గ్ నివేదిక బయటకు రాగానే అదానీ వ్యాపార సామ్రాజ్యం ఒక్క సారిగా కుదేలైంది. ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌ ద్వారా అదానీ గ్రూప్‌ తన లిస్టెడ్‌ కంపెనీల షేర్లను అడ్డగోలుగా పెంచుకుందన్నది హిండెన్‌బర్గ్‌ నివేదిక  పేర్కొంది.

అయితే ఈ నివేదిక అబద్ధాల పుట్ట అంటూ అదానీ గ్రూప్ అప్పట్లో ఖండించింది. అయితే ఇప్పుడు ఆ ఆరోపణలు వాస్తవమేనని సెబీ దర్యాప్తు తేల్చింది. సెబీ దర్యాప్తు వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాకపోయినప్పటికీ.. తమ వ్యాపారాలను కుదేలు చేయడానికి కుట్ర జరుగుతోందనీ, హిడెన్ బర్గ్ నివేదిక అందులో భాగమేననీ అదానీ గ్రూప్ అప్పట్లో గగ్గోలు పెట్టింది. అదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా అప్పట్లో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. పార్లమెంటు వదికగా చర్చోపచర్చలు, ఆరోపణల పర్వం కొనసాగింది.  కార్పొరేట్  రాజకీయ అక్రమ సంబంధాలపై పాత చర్చ కొత్తగా తెరమీదకు వచ్చింది. భారత వ్యాపార దిగ్గజాలలో ఒకరైన విప్రో ప్రేమ్ జీ ప్రమేయంపై కూడా అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.  2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించి  ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నట్లు అనుమానిస్తున్న కుట్రలో భాగంగా అదానీని టార్గెట్ చేశారని కూడా అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి.  ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అదానీ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు ఉన్నట్లు కనిపించినా, ఆ గ్రూపు కంపెనీలు నిలదొక్కుకోవడానికి తెరవెనుక చేయగలిగినంతా చేసింది. అందులో భాగంగానే అదానీ వ్యవహారంలో కుట్ర కోణాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లుగా చెప్పిన  భారత దర్యాప్తు సంస్థలు విప్రో  యజమాని  పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ ప్రమేయం ఉన్నట్లుగా లీకులిచ్చాయి.    ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో అప్పట్లో వచ్చిన కథనం తార్కానం అని చెబుతారు.

హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడిసతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్ఛంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ  ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తోందని ఆర్గనైజర్‌ ఆ కథనంలో పేర్కొంది. ఆర్గనైజర్‌ కథనం ప్రకారం, ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్షణ ముస్గులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ,  Adaniwatch.org అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.  హిండెన్‌బర్గ్ కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు  అని ఆర్గనైజర్‌ పేర్కొంది. అలాగే  ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే  ది వైర్ కథనాలు రాసిందని కూడా ఆర్గనైజర్‌ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే  అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ. అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ  భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని ఆర్గనైజర్‌ ఆ కథనంలో ఆరోపించింది.

అయితే అదానీని అడ్డం పెట్టుకుని మోడీని రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర కోణ ఉందంటూ అప్పట్లో ఆర్గనైజన్ వండి వార్చిన కథనాలన్నీ అవాస్తవాలని తాజాగా సెబీ దర్యాప్తులో బట్టబయలైంది.  నిబంధనల ప్రకారం ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌ ఏవీ భారత లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీలో ఎఫ్‌పీఐల ద్వారా 10 శాతం వాటాకు మించి కొనుగోలు చేయరాదు. అంతకు మించితే ఆ విషయాన్ని వెంటనే సంబంధిత కంపెనీ వెంటనే రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేయాలి. అప్పుడు ఆ పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)గా పరిగణిస్తారు. ఈ విషయంలోనూ అదానీ గ్రూప్‌ నిబంధనలను అడ్డగోలుగా తుంగలో తొక్కినట్టు సెబీ గుర్తించింది.

 మరోవైపు సుప్రీంకోర్టులో మంగళవారం( ఆగస్టు 29) అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల కేసు విచారణకు రానుంది. దీనిపై తమ దర్యాప్తు కూడా దాదాపు పూర్తయిందని సెబీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో సెబీ, సుప్రీం కోర్టు.. అదానీ గ్రూప్‌ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా సెబీ దర్యాప్తులో అదానీ గ్రూపు ఉల్లంఘనలు బట్టబయలయ్యాయన్న వార్తలపై ఈ గ్రూపు ఇంత వరకూ స్పందించలేదు.