బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు తథ్యం.. ఎప్పుడంటే? | kcr to make changes in candidates list| ktr| america| tour| disaccord| party| change| revolt| win
posted on Aug 29, 2023 4:17PM
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక విలక్షణ రాజకీయ నేత. ఆయన ఏ పథకం ప్రకటించినా, ఏ కార్యక్రమం చేపట్టినా సంచలనంగానే ఉంటుంది. ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వారిని దిగ్భ్రమలో ముంచెత్తేలా నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకత. తెలంగాణ సాకారం అయితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించడం దగ్గర నుంచీ, తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ ను (అప్పుడు టీఆర్ఎస్) కాంగ్రెస్ లో విలీనం చేస్తాననడం వరకూ ఆయన మాటే ఒక సంచలనం, ప్రకటన మరో సంచలనం అన్నట్లుగానే సాగింది.
ప్రకటనలు చేయడం తరువాత వాటి గురించి పూర్తిగా విస్మరించడం ఒక విధానంగా కేసీఆర్ డెవలప్ చేశారు. తాజాగా ఆయన ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేశారు. ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీలో తన మాటే శాసనం అన్న పరిస్థితి ఉందని అందరికీ చాటేందుకు ఆయనీ ఎత్తుగడ వేశారు. అయితే ఆయన ఎత్తుగడ ఫలించినట్లు కనిపించదు. ఎందుకంటే ఆయన ఇలా జాబితా ప్రకటించారో లేదో.. అలా అసమ్మతి భగ్గుమంది.
కేసీఆర్ కు అత్యంత విశ్వాస పాత్రులుగా గుర్పింపు పొందిన నేతలే అసమ్మతి గళం ఎత్తారు. టికెట్ లభించని పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకున్న తరువాత కూడా ఆయన అసమ్మతి రాగం ఆలపిస్తూనే ఉన్నారు. రాజయ్య వంటి వారు తమ ధిక్కారాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మైనంపాటి వంటి నేతలైతే బహిరంగ సమావేశాలు నిర్వహించి మరీ తిరుగుబావుటా ఎగుర వేశారు. అనూహ్యంగా పార్టీ పునాదులే కదిలిపోయేంతగా అసమ్మతి వెల్లువెత్తడంతో కేసీఆర్ వెనక్కు తగ్గక తప్పలేదు. టికెట్ ప్రకటించిన వారందరికీ పార్టీ బీఫారం దక్కుతుందన్న గ్యారంటీ లేదని ఆయన తన ప్రకటనలో సవరణలు ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో టికెట్ దక్కని వారు ఇప్పటికే ధిక్కారం తెలియజేస్తుంటే.. రేపు టికెట్ వచ్చిందని ప్రస్తుతం ఆనందంలో ఉన్న నేతలలో కొందరికి రేపు బీఫారంలు అందక నిరసన గళం వినిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
115 మందితో బీఆర్‌ఎస్ తొలిజాబితా ప్రకటించిన కేసీఆర్ వారందరికీ , బీ ఫారం ఇస్తారా? అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు జాబితాలో ఉన్న వారందరికీ బీఫారాలు దక్కుతాయన్న నమ్మకం లేదని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. కచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు ప్రకటించిన జాబితాలో మార్పులు, చేర్పులు ఉంటాయని అంటున్నారు. తొలి జాబితాలో పేరు ఉన్న మైనంపల్లి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మైనంపాటి హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. తాను, తన కుమారుడు ఇద్దరం కచ్చితంగా వచ్చే ఎన్నికల బరిలో దిగుతామని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. మైనంపల్లి పార్టీ మారడం ఖాయమైతే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరొకరిని కేసీఆర్ నిలబెట్టాల్సి ఉంటుంది. ఇక ఖమ్మంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు తిరుగుబావుటా ఎగురవేశారు. తుమ్మల పార్టీ వీడితే ఆ ప్రభావం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ బీఆర్ఎస్ ను వీడటం వల్ల జరిగిన నష్టం చాలదన్నట్లు తుమ్మల కూడా పార్టీ మారితే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకోవలసిన పరిస్థితి ఎదురౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో డాక్టర్ ప్రహ్లాద్, నకిరేకల్ లో మాజీ ఎమ్మెల్యే వీరేశంలు కూడా బీఆర్ఎస్ ను వీడే యోచన చేస్తున్నారు. నాగార్జున సాగర్ లో బీఆర్ఎస్ వర్గాలు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్యయాదవ్ కూడా పార్టీ వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్ అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు సీటి వ్వడంపై, సీనియర్ దుర్గాప్రసాద్‌రెడ్డి అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్ని ల్లోనే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయన డీపీరెడ్డి..ఈసారి టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. అయితే మళ్లీ కాలేరు పేరు ప్రకటించడంతో అక్కడ కూడా అసమ్మతి తీవ్రంగా వ్యక్తం అవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. కనీసంలో కనీసం పాతిక స్థానాలలో బీఆర్ఎస్ విజయంపై అసమ్మతి ప్రభావం తీవ్రంగా ఉంటుందనీ, 40 స్థానాలకు పైగా అసమ్మతి ప్రభావం గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాను ప్రకటించిన జాబితా విషయంలో స్వయంగా కేసీఆర్ పునరాలోచనలో పడ్డారనీ, రానున్న రోజులలో ఈ జాబితాలో కచ్చితంగా మార్పులు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంత లేదన్న పాతిక నుంచి ముఫ్పై నియోజకవర్గాలలో ఆభ్యర్థులను మార్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ సీనియర్లు చెబుతున్నారు. తాజాగా 34 నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వే జరుగుతోందని చెబుతున్నారు. అభ్యర్థులపై వ్యతిరేకత పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారనీ, తాను ప్రకటించిన జాబితా కేవలం ప్రతిపాదిత జాబితా మాత్రమేనంటూ అసంతృప్తిలో ఉన్న నేతలకు వర్తమానం పంపుతున్నారనీ, ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అసలు జాబితా విడుదల చేస్తామనీ చెబుతున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది. అన్నిటికీ మించి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కొన్ని అభ్యర్థిత్వాలపై పునరాలోచన జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.