posted on Aug 30, 2023 4:19PM
తాను గేట్లు తెరిస్తే వైసీపీ అనేదే లేకుండా పోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అతిపెద్ద సమస్య జగన్ అని, జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. విభజన గాయాల కంటే జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన గాయమే పెద్దదన్నారు. తాను టీడీపీ గేట్లు తెరిస్తే… వైసీపీలో ఒక్కరు కూడా మిగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక బీజేపీతో పొత్తులపై మాట్లాడిన చంద్రబాబు.. అంతర్గతంగా తాము ఏం చర్చిస్తున్నాం అనే విషయం ఎవరికీ తెలియదని చెప్పారు. తాను చూడని రాజకీయం లేదని దేశ నిర్మాణంలో భాగం కావడమే తన ఉద్దేశమని అన్నారు. అది ఏ విధంగా, ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసమే అప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని, హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలోనే కేంద్రంతో విభేదించానని, మిగతా విషయాలలో తనకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో పొత్తుల విషయం కాలమే నిర్ణయిస్తుందని చెప్పిన చంద్రబాబు తెలంగాణలో మాత్రం బీజేపీతో పొత్తు లేదని తేల్చేశారు. తెలంగాణలో పొత్తులకు సమయం మించిపోయిందని, తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చంద్రబాబు ప్రకటించారు.
కాగా చంద్రబాబు తాను గేట్లు తెరిస్తే వైసీపీ మాయమవుతుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీశాయి. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు కూడా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని పలు సందర్భాలలో చెప్పిన సంగతి విదితమే. నెల్లూరు లాంటి జిల్లాలలో అయితే వైసీపీ ఇప్పటికే కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అటు విజయనగరంలో మంత్రి బొత్స కుటుంబ సభ్యులే టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారన్న చర్చ పొలిటిల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీలోకి వెళ్లిన నేతలు చాలామంది ఇప్పుడు సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరికొందరు టికెట్లు దక్కవనే ఉద్దేశ్యంతో తమ దారి తాము చూసుకోలేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు ప్రభుత్వంపై అసంతృప్తి ప్రజలు తమపై చూపిస్తారన్న జంకుతో గోడదూకేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మరోవైపు ఎమ్మెల్యేలను ఎంపీలుగా.. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే ప్లాన్ ఒకటి వైసీపీ అధిష్టానం సిద్ధం చేస్తున్నదని ప్రచారంలో ఉండగా.. పార్లమెంటుకు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడడం లేదు. ఇప్పటికే సర్వేలు ఈసారి వైసీపీ గట్టెక్కడం కష్టమేనని తేల్చేయడంతో.. తెలిసి తెలిసి మునిగే పడవలో ప్రయాణం ఎందుకని అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జనసేన, బీజేపీ కలిసి టీడీపీతో పొత్తుకు వెళ్తే అడ్డుకోవడం అసంభవం అనే భావన ఉన్న నేపథ్యంలో ముందుగానే కొందరు వైసీపీ నేతలు ఈ కూటమిలో సీటు కోసం ఖర్చీఫ్ వేసే సన్నాహాలలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తాను గేట్లు తెరిస్తే అనే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇంత వరకూ వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం. సహజంగా చంద్రబాబు ఒక్క మాటంటే వెయ్యి మాట్లాడే వైసీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడానికి జంకుతున్నారు. దీంతో వైసీపీలో ఏం జరుగుతొంది? యుద్ధం మొదలు కాకుండానే వైసీపీ అస్త్ర సన్యాసం చేసేసిందా? వైసీపీ మౌనం ఓటమిని అంగీకరించేసినట్లేనని భావించాల్సి ఉంటుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.