Leading News Portal in Telugu

తుమ్మల కాంగ్రెస్ లో చేరిక ఖాయం.. పోటీ ఎక్కడ అన్నదే డైలమా?! | tummala to join congress| confirm| contest| paleru| dilemma| ponguleti


posted on Aug 31, 2023 10:44AM

ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న పేరు, అంశం ఏదైనా ఉందంటే అది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. తుమ్మల నాగేశ్వరరావు చాలా కాలంగా బీఆర్ఎస్ లో కొనసాగుతున్నా, ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన పార్టీ మారే యోచన చేస్తున్నారనీ, అయితే ప్రతి సారీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను పలిపించుకునో, రాయబారం పంపో బుజ్జగించి నిర్ణయం ప్రకటించకుండా ఆపుతున్నారనీ పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.

అయితే ఆ ప్రచారం అంతా ఉత్తిదేననీ, తుమ్మల కారు దిగడం ఖాయమైపోయిందనీ.. హస్తం చేయందుకోవడానికి రెడీ అయిపోయారనీ ఆయన సహచరులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ తుమ్మల బీఆర్ఎస్ లోనే కొనసాగుతారంటూ జిల్లా పార్టీ నేతలలో మిణుకుమిణుకు మనే ఆశ ఉండేది. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చే ఎన్నికలలో  బీఆర్ఎస్ అభ్యర్థులుగా రంగంలో ఉండే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారో అదే రోజు తుమ్మల ఇక బీఆర్ఎస్ లో ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే ఆయన బీఆర్ఎస్ ను వీడి ఏ పార్టీలో చేరుతారన్న విషయంలోనే నిన్న మొన్నటి వరకూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఆయన తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని కొందరు.. కాదు కాదు బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆయన కమలం గూటికి చేరుతారని మరి కొందరూ చెబుతూ వచ్చారు. కానీ తుమ్మల కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న వాదనా బలంగా వినిపించింది.

అసలు వాస్తవమేమిటంటే ఈ ప్రచారాలూ, వాదనలూ అన్నీ ఆయా పార్టీల నుంచే వచ్చాయి. అంటే తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీలు తుమ్మలను మా పార్టీలో చేరాలంటే.. మా పార్టీలో చేరాలని ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపాయి. దీంతో తుమ్మల కారు దిగి ఏ పార్టీతో కరచాలనం చేస్తారన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వచ్చే ఎన్నికలలో తాను కచ్చితంగా పోటీ చేస్తానంటూ తుమ్మల విస్పష్టంగా ప్రకటించడంతో ఆయన బీఆర్ఎస్ తో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నట్లేనని అంటున్నారు. అలాగే  ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కూడా దాదాపు ఖరారైందనీ తుమ్మల సన్నిహితులు చెబుతున్నారు. ఇందుకు వచ్చే నెల 6వ తేదీ ముహూర్తం కూడా ఖరారైందని చెబుతున్నారు. ఆ రోజు ఆయన హస్తిన వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఇందుకు ఒకటి రెండు రోజుల ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా తుమ్మల నివాసానికి వెళ్లి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

 అయితే తుమ్మల కాంగ్రెస్ గూటికి చేరితే ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. తాను పాలేరు నుంచి రంగంలోకి దిగుతానని తుమ్మల గట్టిగా చెబుతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిన పొంగులేటి కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు టికెట్ కోసం ఆ ఇరువురి మధ్యా పోటీ ఏర్పడే అవకాశలు ఉన్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తం మీద తుమ్మల పోటీ ఎక్కడ నుంచి అన్న విషయంలో కాంగ్రెస్ ఆయనకు స్పష్టత ఇచ్చిన వెంటనే చేరికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.