Leading News Portal in Telugu

నారా లోకేశ్ పాదయాత్ర@ 200 డేస్.. అమ్మ దీవెన | mother bhuwaneswari blessing to son lokesh| padayatra| yuvagalam| 200days| kuppam| tdp| win


posted on Aug 31, 2023 10:15AM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. గురువారం (ఆగస్ట్ 31)తో  రెండు వందల రోజులు పూర్తి చేసుకోనుంది. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర.. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే గురువారం లోకేశ్ పాదయాత్రలో తమ కుటుంబ సభ్యులు పాల్గొంటారని ఆయన తల్లి నారా భువనేశ్వరి  తెలిపారు. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్లలో నూతన హెరిటేజ్ పార్లర్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆమె తొలి సారిగా నారా లోకేష్ పాదయాత్రపై స్పందించారు. భగవంతుడు లోకేశ్‌కు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. లోకేశ్ ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు. ప్రజాస్వామంలో  స్వేచ్చగా తమ అభిప్రాయాలను తెలియజేయడానికి  ప్రజల తరఫున లోకేశ్ పాదయాత్ర చేపట్టారని వివరించారు.  

ఈ ఏడాది జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి నారా లోకేశ్.. యువగళం   పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలా ప్రారంభమైన నారా లోకేశ్ పాదయాత్ర.. రాయలసీమలోని నాలుగు జిల్లాలతోపాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మీదుగా  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.  

 ఆయన పాదయాత్ర  దాదాపు  మూడు వేల కిలోమీటర్ల మైలురాక చేరువ అవుతోంది. లోకేశ్ తాను చేపట్టిన పాదయాత్రలో ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలు.. అలాగే యువతకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.  ఇంకో వైపు నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మొత్తం 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగనున్న సంగతి  తెలిసిందే.  

    

ఇంకోవైపు లోకేశ్ పాదయాత్రపై ఆయన తల్లి నారా భూవనేశ్వరి మంగళవారం అంటే ఆగస్ట్ 29వ తేదీన తొలిసారిగా కుప్పంలో  స్పందించారు. నారా లోకేశ్ పాదయాత్ర చూసి తాను ఓ తల్లిగా చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తొలుత నారా లోకేశ్ పాదయాత్ర  చేస్తానన్నప్పుడు తనకు భయం వేసిందని..    వద్దని వారించాననీ అన్నారు.  ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని..  తనను ఆపవద్దనీ లోకేశ్ తనతో అన్నారన్నారు. అంతే ఆ తరువాత తాను ఎప్పుడూ తన బిడ్డను వారించలేదని భువనేశ్వరి వివరించారు.   ప్రజలకు   ఏదో చేయాలనే తపన లోకేష్ లో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం లోకేష్ నిలబడుతున్నారనీ, పార్టీలో కేడర్, ప్రజలు చాలా అవస్థలు పడ్డారని… వాళ్ల గురించి ఆలోచిస్తే.. లోకేశ్ చేసిందేమీ లేదన్నారు. వాళ్ల కోసం వాళ్ల హక్కుల కోసం.. వారి స్వేచ్ఛ కోసం.. లోకేశ్  కష్టపడాలన్నారు. లోకేశ్ ఇప్పటి వరకు.. ఏ నాడు ఈ పాదయాత్రలో అనారోగ్య సమస్యల గురించి తనకు చెప్పిందే లేదన్న భువనేశ్వరి తన బిడ్డ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తారనీ, దేవుడి దీవెనలు లోకేష్ కు పుష్కలంగా ఉన్నాయన్నారు. తల్లిగా తన దీవెనలు ఎప్పుడూ లోకేష్ కు ఉంటాయని చెప్పారు.  

అధికార పార్టీ వల్ల తమ కుటుంబం సమస్యలు ఎదుర్కొందనీ.. అలా ఎదుర్కోవడం తమ కుటుంబానికి అలవాటైపోయిందనీ అన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా  పోరాడి.. విజయంతో బయటకు వస్తామని నారా భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. అయితే తన తండ్రి ఎన్టీఆర్ 100 రూపాయిల నాణెం విడుదల చేయించాలనే ఓ ఆలోచన తన సోదరి పురంధేశ్వరికి వచ్చిందన్న భువనేశ్వరి ఆమెకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కూడా డిసెంబర్ నాటికి పూర్తవుతుందని.. స్థానికంగా ఇల్లు ఉండడం వల్ల ప్రజలకు మరింత దగ్గరాగా ఉంటామని  వివరించారు. కుప్పంలో మళ్లీ చంద్రబాబు మంచి మెజార్టీతో  గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ వారు  తనపై చేసిన వ్యాఖ్యల నుంచి బయటకు రావడానికి తనకు నెలరోజులు పట్టిందని…. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు తనకు మద్దతుగా, అండగా నిలిచారని చెప్పారు.  ఇక ఎవరు ఎన్ని అన్నా లెక్క లేదన్నారు. ఒకసారి ఎదుర్కొన్నాం.. ఇంకా పదిసార్లు అయినా ఎదుర్కొంటామన్నారు. 2024లో తప్పకుండా.. తెలుగుదేశంఅధికారంలోకి వస్తుందని నారా భువనేశ్వరి విశ్వాసం వ్యక్తం చేశారు. 

తన భర్త చంద్రబాబు నాయుడిని కుప్పం ప్రజలు.. ఏడు సార్లు గెలిపించారని… ఆ నియోజకవర్గ ప్రజల రుణం తాము తీర్చుకోలేనిదన్నారు. అలాగే వారు చూపించే అభిమానం ఈ జన్మలో మరిచిపోలేమని చెప్పారు. అందుకు ప్రతీగా వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సంజివీని ఆరోగ్య క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని ద్వారా పేద వారందరికి ఆరోగ్యం అందుతోందని ఆమె ఆకాంక్షించారు. సంజివీని క్లినిక్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఓ బస్సు ఏర్పాటు చేస్తామని.. ఈ బస్సు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తుందన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాల్లో.. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఈ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు నారా భువనేశ్వరి వివరించారు. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు చేసేందుకు కృషి చేస్తామని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.