పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. మోడీ ముందస్తు సంకేతమేనా? | modi sign of early elections| parliament| special| session| september| five
posted on Sep 1, 2023 10:52AM
గత కొన్ని రోజులుగా దేశంలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేజిక్కించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమేనని భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంత అన్నది ఇతమిథ్ధంగా తెలియదు కానీ.. మోడీ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు జరుగుతున్న ప్రచారం వాస్తవమేననిపించేలా ఉన్నయని చెప్పడానికి మాత్రం ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
వంట గ్యాస్ ధరలు తగ్గించడం, త్వరలో పెట్రో ధరలు కూడా భారీగా తగ్గే అవకాశాలున్నాయన్న ప్రచారంతో పరిశీలకుల విశ్లేషణే కాకుండా సామాన్య జనం కూడా మోడీ ముందస్తుకు సమాయత్తమౌతున్నారన్న భావనకు వచ్చేశారు. దీనికి మరింత బలం చేకూర్చే విధంగా ఈ నెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇటీవలే ముగిశాయి. మణిపూర్ హింసాకాండపై సుదీర్ఘ ప్రతిష్ఠంభణ అనంతరం విపక్షాల అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరిగింది. సరే ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందనుకోండి అది వేరే సంగతి. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఉన్నది ముందస్తు వ్యూహమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వరుసగా రెండు పర్యాయాలు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలను చేపట్టిన మోడీ సర్కార్.. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలన్న కలను నిజం చేసుకోవడానికి తొమ్మదేళ్లకు పైగా సాగిన మోడీ పాలనపై పెల్లుబుకుతున్న ప్రజా వ్యతిరేకత అడ్డంకిగా నిలిచింది. దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికీ.. దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ పట్ల ఇటీవలి కాలంలో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ధరల నియంత్రణ లేకపోవడం, వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న నేపథ్యంలో వాగ్దానాలను నెరవేర్చడంలే వైఫల్యం కూడా మోడీ సర్కార్ పై యాంటీ ఇంకంబెన్సీ తీవ్రంగా ఉండటానికి కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. అదే సమయంలో విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక మీనింగ్ ఫుల్ కంక్లూజన్ దిశగా సాగుతుండటం, రాహుల్ భారత్ జోడీ యాత్ర తరువాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల జనంలో ఏదో ఒక మేర సానుకూలత వ్యక్తం అవుతుండటం కూడా బీజేపీ అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది.
ఈ పాజిటివ్ వేవ్ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి అదొక ప్రభంజనంలో దేశాన్ని చుట్టేసే ప్రమాదాన్ని పసిగట్టిన మోడీ బృందం.. విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక కొలిక్కి వచ్చేలోగానే ఎన్నికలకు వెడితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికి వచ్చాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్నేళ్లుగా లేనిది.. ఇన్నేళ్లుగా లేనిది అనడం పూర్తిగా సరికాదు.. ఎందుకంటే ఈ తొమ్మిదేళ్లకు పైబడిన మోడీ పాలనలో ధరల పెరుగుదల కు చెక్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే అవి ఎన్నికల సమయంలో మాత్రమే. నిరాటంకంగా పెరుగుతున్న గ్యాస్, పెట్రో ధరలకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కళ్లెం పడేది. పోలింగ్ తేదీ ముగిసే వరకూ వాటి పెరుగుదల ప్రస్తావనే ఉండేది కాదు.
కానీ ఇలా పోలింగ్ పూర్తయ్యిందో లేదో అలా ధరల కళ్లేలు తెంపుకుని పెరిగేవి. సరే ఇప్పుడు అనూహ్యంగా గ్యాస్ బండ ధరను ఒకే సారి 200 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం ఇది ఆడబడుచులకు మోడీ ఇచ్చిన రక్షాబంధన్ కానుకగా ప్రకటించింది. ఈ తొమ్మదేళ్లలో ప్రతి ఏటా రఖీ పండుగ వచ్చింది. కానీ ఇప్పుడు తప్ప గతంలో ఎన్నడూ మోడీ ఆడబడుచులకు రక్షా బంధన్ కానుక ప్రకటించలేదు. ఇప్పుడు ముందస్తు మూడ్ లో ఉన్నారు కనుకనే ఉరుములేని పిడుగులా ఆడబడుచులపై అభిమానం, అనురాగం పెరిగిపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరగనున్నాయి. అదే సమయంలో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. దీంతో మోడీ మూలన పడేసిన జమిలి నినాదాన్ని మళ్లీ తలకెత్తుకున్నారు.
ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకూ, ఆ వెంటనే నాలుగు నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు, వాటితో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది చివరిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలతో పాటే వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న సార్వత్రిక, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేస్తే ప్రజాధనం వృధాను అరికట్టినట్లు అవుతుందన్న వాదనను మోడీ బృందం బలంగా తెరపైకి తీసుకువస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉన్న అసెంబ్లీల ఎన్నికలకు సన్నాహాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించేసింది. వాటితో పాటు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు సై అనడం కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు మోడీ సర్కార్ రెడీ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన సన్నాహాలను కేంద్ర ఎన్నికల సంఘం చాపకింద నీరులా చేసుకుంటూ పోతోందని కూడా ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. ఏపీ, ఒడిషాల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించారు. పలు రాష్ట్రాలలో ఓటర్ల జాబితా ఫైనల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తంగా కేంద్రం… నిర్ణయం తీసుకుంటే అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.