షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు.. మళ్ళీ సొంత గూటికి వైసీపీ నేతలు? | ap congress responsibilities to sharmila| ycp| vote| bank| transfer| jagan| sarkar| anti
posted on Sep 1, 2023 2:41PM
మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖాయమైంది. అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో షర్మిల ప్రారంభించిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్టీపీ ఇక కనుమరుగు కానుంది. ఒకటీ రెండు రోజులలోనే ఈ విలీన ప్రక్రియ జరగనున్నట్లు రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్నది. ఇప్పటికే దక్షణాది కాంగ్రెస్ అగ్రనేతలతో పలుమార్లు సమావేశమైన వైఎస్ షర్మిల తాజాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా భేటీ అయి చర్చించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, పార్టీలో విలీనం చేయడం వల్ల తనకు పార్టీ కల్పించే అవకాశాలు తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చర్చించినట్లుగా తెలుస్తొంది. షర్మిల పార్టీ విలీన ప్రక్రియ అయితే ఖరారైంది కానీ.. ఇంతకీ ఆమె ఏపీ రాజకీయాలకు వెళ్తారా? లేక తెలంగాణ రాజకీయాలలోనే ఉంటారా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇంతకీ ఆమె ప్రయాణం రెండు పడవలపై అంటే ఆమె తెలంగాణ, ఏపీలలో రాజకీయాలు చేస్తే ప్రయోజనం ఏమిటి? ఎవరికి అన్న విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ షర్మిల సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలో వినియోగించుకోవడానికే మొగ్గు చూపుతోంది. షర్మిలకు తెలంగాణ నుండే ఒక ఉన్నత పదివితో పాటు కర్ణాటక కోటా నుండి రాజ్యసభకు పంపించనున్నారన్న చర్చ కూడా సాగుతోంది. అదీ కాక ఆమెను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు లేకపోలేదని కూడా చెబుతున్నారు. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల ఇక్కడే కాంగ్రెస్ నుండి రాజకీయాలు మొదలు పెట్టనుండగా.. ఏపీలో ఎన్నికల సమయానికి ఆమె ఏపీ పీసీసీ పగ్గాలు అందుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తున్నది.
అదే జరిగి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపడితే ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే కనుక వైసీపీకి తీరని నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయపరిశీలకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమౌతున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలలో సైతం పార్టీపై అసంతృప్తి వ్యక్తం అవుతోందని అంటున్నారు. అయితే, వీరిలో కొందరు ప్రస్తుతం టీడీపీ, బీజేపీతో టచ్ ఉండగా మరికొందరు ఆ పార్టీల్లోకి వెళ్లలేక.. వైసీపీలో ఉండలేక సతమతమవుతున్నారంటున్నారు. షర్మిల కనుక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే ఇలాంటి వారందరూ కాంగ్రెస్ లోకి క్యూకట్టడం ఖాయమని అంటున్నారు. గతంలో వైఎస్ హయంలో కాంగ్రెస్ లో చక్రం తిప్పిన నేతలలో కొందరు ఇప్పుడు వైసీపీలో ఉక్కపోతకు గురవుతున్నారు. షర్మిల కనుక ఏపీ పీసీసీ పగ్గాలు చేపడితే వీరంతా మళ్ళీ సొంత గూటికి అంటే కాంగ్రెస్ లోకి రావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, పార్టీలో అగ్ర నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ వంటి నాయకులు కూడా షర్మిలతో కలిసి ప్రయాణం మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. భవిష్యత్ పరిణామాలు, ప్రస్తుత పార్టీలో ఎదుర్కొంటున్న అంతర్గత వర్గ పోరుతో చాలా మంది నేతలు మరో కొత్త అప్షన్ కోసం ఎదురుచూస్తుండగా ఇలాంటి వారికి షర్మిల కాంగ్రెస్ బెస్ట్ ఛాయిస్ గా మారడం ఖాయమంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లోనే దాదాపు పదిశాతం ఓటు బ్యాంక్ వైసీపీకి దూరమై కాంగ్రెస్ బదలాయింపు జరగడం గ్యారంటీగా కనిపిస్తున్నది. వైసీపీకి గత రెండు పర్యాయాలు దళిత, ముస్లిం, క్రైస్తవ వర్గాల్లో అధిక సంఖ్యాకులు మద్దతు ఇచ్చారు. షర్మిల ఏపీకి వస్తే వీరిలో దాదాపు 30 శాతం ఓటు బ్యాంకు మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తెలంగాణలో పార్టీ పుంజుకోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఏపీ నేతలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ హయంలో చక్రం తిప్పిన ఇద్దరు ముగ్గురు బడా నేతలను అండగా పెట్టి కాంగ్రెస్ ఏపీలో షర్మిలతో రాజకీయం మొదలు పెట్టనున్నట్లు తెలుస్తున్నది.