Leading News Portal in Telugu

బాబుకు ఐటీ నోటీసులు.. బీజేపీ వ్యూహంలో భాగమేనా? | it show cause notice to chandrababu| bjp| strategy| ap| politics| alliances| pressure| tdp| seats


posted on Sep 2, 2023 6:57AM

ఏపీ రాజకీయాలలో బీజేపీ వ్యూహమేంటి అన్నది రాజకీయ పరిశీలకులకు కూడా ఒక పట్టాన అర్ధం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో రాజకీయాలకు తెరతీసే బీజేపీ ఏపీ విషయంలో ఎలా పావులు కడుపుతున్నదీ అంతు చిక్కడం లేదు.  ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంతో తెర వెనక దోస్తీ నడుపుతున్న బీజేపీ కేంద్ర పెద్దలు.. రానున్న ఎన్నికల సమయానికి ఏ వైపు వెళ్తారన్నది కన్ఫ్యూజన్ లో పెడుతున్నారో లేదా వారే కన్ఫ్యూజన్ లో ఉన్నారో తెలియడం లేదు.  ఏపీలో ఇప్పటికే బీజేపీ జనసేనతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. జనసేనతో పాటు బీజేపీ కూడా తెలుగుదేశంతో  కలిసి వస్తుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప చంద్రబాబు కానీ, బీజేపీ పెద్దలు కానీ పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. చేయడం లేదు. పవన్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కలిసే వెళ్తామని ధీమాగా చెప్తున్నారు.

 ఏపీలో ప్రతిపక్షాల మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అన్న అనుమానాల మధ్యనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపింది. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పనిలో పనిగా ఎన్నికల కమిషన్ కు ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేయడంతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు బీజేపీ పట్ల సానుకూలంగానే మాట్లాడారు. ఏపీలో పొత్తులను కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. చంద్రబాబు ఒకవైపు బీజేపీ పెద్దలతో పోత్తులపై చర్చలు జరుపుతుండగానే.. బీజేపీ మాత్రం టీడీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. తాజాగా చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా ఆయన వంద కోట్లకుపైగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. 

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో కాంట్రాక్టు సంస్థలను బెదిరించారని, బోగస్‌ కంపెనీలు సృష్టించి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. అయితే, ఒకవైపు పొత్తులపై చర్చలు జరుపుతూనే మరో వైపు ఆదాయపన్ను నోటీసులు పంపడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. టీడీపీపై బీజేపీ పెద్దలు ద్విముఖ వ్యూహంతో వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తుంది. ఒకవైపు పొత్తుల చర్చల పేరిట చర్చలు జరుపుతూనే.. మరో వైపు ఐటీ నోటీసుల వెనక ఏదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పొత్తులో సాధ్యమైనంత ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడంతో పాటు టీడీపీని తమ గ్రిప్ లో ఉంచుకొనే వ్యూహం ఏమైనా బీజేపీ పెద్దలలో  ఉందా అన్న చర్చ సాగుతున్నది. 

ఏపీలో బీజేపీకి ఇలాంటి రాజకీయాలు కొత్తేమీ కాదు. గత ఎన్నికల ముందు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలోని టీడీపీ నాయకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. టీడీపీ ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టి వైసీపీ గెలుపుకు సహకరించాయి. ఇప్పుడూ అదే రీతిలో వచ్చే ఎన్నికల సమయానికి కూడా రంగం సిద్ధం అవుతోందా అనిపిస్తున్నది. అటు అవినీతి అక్రమాస్తుల కేసులు, ఇటు బాబాయ్ వివేకా హత్యకేసులను అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్ ను బీజేపీ పెద్దలు ఇప్పటికే తమ చెప్పు చేతల్లో ఉంచుకున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు జేపీ నడ్డాతో పొత్తులపై అలా చర్చించారో లేదో ఇలా జాతీయ మీడియా ఏపీలో పొత్తులపై.. టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల పంపకాలపై ఊహకు అందని లెక్కలతో కథనాలు వండి వార్చాయి. ఆ కథనాలు వాస్తవానికి బహుదూరమని రాజకీయ పరిశీలకులు కొట్టిపారేశారు.

అదలా ఉండగానే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు అంటూ మళ్ళీ అదే మీడియాలో కథనాలు వచ్చాయి. మొత్తంగా బీజేపీ ప్రస్తుత వైఖరి చూస్తే అటు దర్యాప్తు సంస్థలను, మీడియాను అడ్డం పెట్టుకొని పొత్తుల విషయంలో చంద్రబాబు బీజేపీకి దాసోహం అంటున్నారనే ప్రచారాన్ని సాగించడం, పొత్తుల విషయంలో తమ డిమాండ్లకు తగ్గట్లుగా ఏదో ఒక ప్రకటన చేసేలా ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది.