posted on Sep 2, 2023 10:54AM
కేరళ, ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలు కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. మనిషి ఆరోగ్యానికి అవసరమైన అన్నీ పుష్కలంగా ఉన్న ఫలం నారికేళం. ఆరోగ్యానికే కాకుండా ఏ శుభ కార్యాన్నైనా కొబ్బరి కాయ కొట్టే ప్రారంభిస్తారు. శుభాలకు కొబ్బరి కాయను ప్రతికగా భావించడం కద్దు. అదే విధంగా కొబ్బరి కాయను మానవ శరీరానికి ప్రతికగా చెబుతారు. కొబ్బరి కాయలో ఉండే నీటిని మనిషిలోని నిర్మలత్వానికి, కొబ్బరి పీచుకు మనిషిలోని అహానికీ, ఇక కొబ్బరిని మనిషి మనసుకూ ప్రతీకగా అభివర్ణిస్తారు. అంటే ప్రతి మనిషీ తనలోని అహంకారాన్ని విస్మరించి, నిర్మలత్వంతో మంచి మనసుతో మెలగాలని కొబ్బరికాయ చెబుతుందంటూరు.
మనిషి ఆరోగ్యానికి అవసరయ్యే వాటన్నింటినీ ప్రకృతి మనకు సహజంగానే అందించింది. కానీ మనమే ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ల పేరుతో అనారోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాము. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి ఒకటి. మనిషికి అత్యవసరమైన ఆరోగ్య, ఔషధ, సౌందర్య ప్రయోజనాలను అందించే కొబ్బరికాయకూ ఓ ప్రత్యేక రోజు ఉందని తెలుసా? సెప్టెంబర్ 2ను ప్రపంచ కొబ్బరికాయ దినోత్సవంగా పాటిస్తారు. ఇన్ని సుగుణాలున్న కొబ్బరిని దక్షిణాది రాష్ట్రాల్లో వంటల్లో విరివిగా వినియోగిస్తారు. ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని తొలిసారిగా 2009 సంవత్సరంలో జరిపారు. కొబ్బరి వినియోగం, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ కొబ్బరి దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక కమిటీ ఈ ప్రపంచ కొబ్బరికాయ ఈ దినోత్సవాన్ని గుర్తించింది.