Leading News Portal in Telugu

కేంద్రం ముందస్తు ఆలోచన.. మరి జగన్ నిర్ణయం మాటేంటి? | center for early elections| what| about| jagan| ap| politics| seven| months


posted on Sep 2, 2023 12:58PM

దేశంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జమిలి   పేరిట దేశంలో సాధారణ ఎన్నికలు ముందే జరగనున్నాయా? అంటే మోడీ సర్కార్ అడుగులను గమనిస్తే.. ఆ అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. జమిలి ఎన్నికలు, ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. పేరేదైనా ఈ ఏడాదే దేశంలో ఎన్నికలు జరుగుతాయా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో దేశంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్నాయి. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరగొచ్చని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు కేంద్రం నిర్ణయాలు తోడై దేశవ్యాప్తంగా చర్చల రచ్చ జరుగుతున్నది. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు బిల్లుల ఆమోదానికా, ముందస్తు ఎన్నికల ప్రణాళికకా అన్న అనుమానాలు గట్టిగా వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే  వన్ నేషన్–వన్ ఎలక్షన్‌  అంశంపై మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో   కేంద్రం ఒక  కమిటీ వేసిన సంగతి  తెలిసిందే. ఈ కమిటీ  నివేదిక   కేంద్రానికి కావాల్సినట్లు ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఎంపీలతో ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసిన బీజేపీ పెద్దలు అందరినీ ఒక చోట చేర్చి ఏ సంకేతాలిచ్చారన్నది ఆసక్తి రేపుతోంది. జరుగుతున్న అన్ని పరిణామాలను చూస్తే ముందస్తు జమిలి ఎన్నికలు జరగొచ్చని చర్చ జోరుగా సాగుతుంది. ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ ముందస్తు వ్యవహారంపై ఒక క్లారిటీ రానుంది. 

నిజానికి ఈ ముందస్తు వ్యవహారం కొత్తదేమీ కాదు. కేంద్రంలో మోడీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికలు దిశగా కొద్ది రోజులు ప్రయత్నాలు జరిగాయి. కానీ  అప్పుడు అది కేవలం  ప్రతిపాదనగానే మిగిలిపోయింది. ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి బీజేపీ ప్రభుత్వానికి ఏదొక అడ్డంకులు ఏర్పడడంతో ఇది ప్రతిపాదన దశలోనే ఉండిపోయింది. కాగా మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు  ఉండటంతో కేంద్రం మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావనను ముందుకు తీసుకువచ్చింది.  కేవలం ప్రస్తావనతోనే వదిలేయకుండా ఈసారి ఏకంగా ఈ ప్రతిపాదనను ఆచరణలో  పెట్టాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది.  మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ ముందస్తుకు తెలంగాణలో ఎలాంటి సమస్య లేదు. ముందే ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉండటమే అందుకు కారణం. అయితే కేంద్రం ముందస్తుకు వెళ్తే తెలంగాణలో ఎన్నికల సమయానికే దేశమంతా ఎన్నికలు జరుగుతాయి. 2024 మేలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా.. అదే ముందస్తుకు జగన్ ఒకే చెప్తే వైసీపీ సుమారు ఎనిమిది నెలల ముందే ఎన్నికలను ఎదుర్కొనవలసి ఉంటుంది.  జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రాతి తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో జగన్ ముందస్తుకు సై అంటే ఎడెనిమిది నెలల ముందే అధికారం కోల్పోవలసి వస్తుందని అంటున్నారు. మరి దీనికి జగన్ ఒకే చెప్తారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిర్దిష్ట గడువుకు ఒక్క క్షణం ముందు కూడా అధికారానికి దూరం కావడానికి ఇష్టపడదు. మరి జగన్ కేంద్రం ప్రతిపాదిస్తున్న ముందస్తుపై ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం రాజకీయ సర్కిల్ లో ఉత్కంఠగా మారింది.  కేంద్రం లోక్ సభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే ఏపీలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ముందే జరగాల్సి ఉంటుంది. జగన్ ముందస్తుకు వెళ్ళకూడదు అనుకుంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. కానీ, ఈ ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. 

ఇంకా చెప్పాలంటే అసలు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నా.. జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా వైసీపీ మద్దతు కూడా తప్పనిసరి అని చెప్పాలి. జమిలి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం 543 లోక్ సభ ఎంపీలలో 67 శాతం మంది మద్దతు కావాలి. అలాగే రాజ్యసభలో కూడా 245 సభ్యులలో 67 శాతం మంది మద్దతు కావాలి.   లొక్ సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉండగా.. రాజ్యసభలో వైసీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వీరి అవసరం ఇప్పుడు బీజేపీకి ఉంది. దీనిని బట్టి చూస్తే జమిలీ ఎన్నికల కోసం కేంద్రానికి వైసీపీ మద్దతు ఇస్తే దాదాపుగా రాష్ట్రంలో కూడా అసెంబ్లీ రద్దుకు సిద్దపడ్డట్లే భావించాలి.  ఇలా ఉండగా బీజేపీ అడిగితే కాదనే పరిస్థితిలో   వైసీపీ ఎంత మాత్రం లేదు. అందుకే కేంద్రం జమిలికి రెడీ అయితే.. జగన్ కూడా మారు మాట్లాడకుండా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అయిపోతారనడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.