ఆర్5 జోన్ స్టే ఎత్తివేతకు సుప్రీం నో.. జగన్ కు మరో పరాభవం | supreme shock to jagan| r5| zone| stay| vacate
posted on Sep 2, 2023 4:20PM
భవిష్యత్ రాజధాని కోసం ఏడాదికి మూడు పంటలు పండే భూములను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇస్తే.. అందులో పరిపాలనా భవనాలను కాకుండా గృహాలను నిర్మించాలని, అది కూడా రాజధానేతర ప్రాంతం వాళ్లకు ఇళ్లను నిర్మించాలని వైసీపీ సర్కార్ కుయుక్తులు పన్నింది. ఈ విషయంపై ఇప్పటికే రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. మరోవైపు కోర్టులు ఇది చెల్లదని మొట్టికాయలు వేశాయి. కానీ, కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వాన మాదిరి జగన్ ప్రభుత్వంలో అసలు చలనమే లేదు. అందుకే ఆ మధ్య ఆర్ 5 జోన్ లో ఈ ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తూ జీవో జారీచేసింది. అనంతరం ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్లాన్ వేసింది. అయితే, దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది.
ఈ అనుమతుల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. ఆ మధ్య ఒకసారి ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. జగన్ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు లబ్థిదారులకు ఉండవని స్పష్టం చేసింది. ఆ వ్యవహారం అలా కోర్టుల పరిధిలో ఉండగానే అమరావతిలో ఇళ్ల స్థలాలలో మౌలిక వసతుల కల్పన పనులను కూడా మొదలు పెట్టారు. కాగా, ఇప్పుడు మరోసారి విచారణ చేసిన సుప్రీంకోర్టు అమరావతి ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను నవంబర్ కు వాయిదా వేసింది.
హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో స్టే వస్తే ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. కానీ, విచారణ నవంబర్ కు వాయిదా పడటంతో అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణం ఊసెత్తే అవకాశం, అధికారం జగన్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కీలక అంశాలున్నాయి. అమరావతి ఆర్5 జోన్లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించిన హైకోర్టు.. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని గుర్తు చేసింది. స్థలం ఇవ్వడానికి మాత్రమే అనుమతి గానీ ఇళ్ళు కట్టడానికి లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రభుత్వం తామే నిర్ణయించిన భూమి విలువ రూ.345 కోట్లు సీఆర్డీఏకు ఇప్పటికీ చెల్లించకపోవడాన్ని హైకోర్టు ధర్మాసనం ఎత్తి చూపింది. దీని కోసం మొత్తం ఖర్చు రూ.1500 నుండి 2000 కోట్లు అవుతుందని, తీర్పు వ్యతిరేకంగా వస్తే ఈ డబ్బుకు ఎవరు బాధ్యులని ప్రశ్నించింది. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుపై వైసీపీ సర్కార్ సుప్రీం వరకూ వెళ్లగా అక్కడ కూడా ఆశించిన ఫలితాలేమీ రాలేదు. తదుపరి విచారణ నవంబర్ కు వాయిదా పడింది. అప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం దాదాపు అసంభవం అని న్యాయనిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒక నిర్దిష్ట ఒప్పందంతో ప్రభుత్వమే ఇక్కడ రైతుల వద్ద నుండి భూములు తీసుకుంది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని కాదని.. ఆ భూములను మరొక రకంగా ఉపయోగించుకోవాలంటే అది కుదిరే పనికాదు. అలా చేయాలంటే ప్రభుత్వం అనుకున్న ఒప్పందం ప్రకారం రైతులకు చేకూరే ప్రయోజనాల విలువను చెల్లించి, అప్పుడు తాను అనుకున్నట్లుగా చేసేందుకు ఉపక్రమించొచ్చు. అలా రైతులకు ప్రయోజనాలు చెల్లించాలంటే ప్రభుత్వం లక్షల కోట్లు అమరావతి రైతులకు చెల్లించాలి. ఈ క్రమంలోనే ఇది జరిగే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదని పరిఇశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికి తెలియని అంశాలేవీ కావు కాదు. తెలిసి కూడా మౌలిక సదుపాయాల పేరిట కోట్లు ఖర్చు చేసింది. ఈ వెచ్చించిన నిధులన్నీ బూడిద పాలే అవుతాయి. మరోవైపు కింది కోర్టు నుండి హైకోర్టు.. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు అంటూ వందల కోట్ల రూపాయలను కోర్టు కేసుల కోసం ఖర్చు చేస్తుంది. మరి ఈ మొండి వైఖరి వలన ఎవరికి లాభమో ఆ జగన్ మోహన్ రెడ్డికే తెలియాల్సి ఉంది.
ఇక నవంబర్ వరకూ ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణం అన్న మాటే ఎత్తే అవకాశం జగన్ సర్కార్ కు లేకుండా పోయింది. దాంతోనే జగన్ ఇంత కాలం చెబుతూ వచ్చిన మూడు రాజధానుల మాట ఇక ఆయన నోట వచ్చే అవకాశమే లేదు. అలాగే సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటూ విశాఖకు మకాం మార్చే అవకాశాలు కూడా మృగ్యమనే చెప్పాలి.