Leading News Portal in Telugu

గుడివాడలో కొడాలి నాని పరాజయం ఖాయమేనా? | kodali nani defeat sure| gudiwada| ycp| venigalla| ramu| ravi| amarawati


posted on Sep 4, 2023 6:25AM

పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు, దివంగత నేత ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా  తెలుగుదేశం గత ఎన్నికలలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్ళలో తెలుగుదేశం తరఫున గెలిచిన   వారిలో మరో ఎమ్మెల్యే కూడా వైసీపీ పంచనే చేరారు. కారణాలు ఏమైనా కానీ ఇది ఆ పార్టీకి తీరని నష్టం కాగా.. ఎంత వీలయితే అంత త్వరగా.. ఏ స్థాయికి వీలయితే ఆ స్థాయికి ఇక్కడ టీడీపీ మళ్ళీ మునుపటి స్థాయిని అందుకోవాలన్న పట్టుదలతో పార్టీ అధినాయకత్వం, శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.

అందునా తెలుగుదేశం పార్టీకి పంటి కింద రాయిలా మారిన ఇద్దరు నేతల స్థానాలను దక్కించుకోవడం కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.  ఆ రెంటిలో  ఒకటి గన్నవరం కాగా రెండో నియోజకవర్గం గుడివాడ. ఒకటి మాజీ మంత్రి కొడాలి నానీ స్థానం కాగా మరొకటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్థానం. ఈ ఇద్దరికీ తొలిసారి సీట్లిచ్చి గెలిపించుకున్నది తెలుగుదేశం పార్టీయే. వారిరువురినీ  ప్రోత్సహించింది పార్టీ అధినేత చంద్రబాబే. కానీ, ఇప్పుడు ఈ ఇద్దరే తెలుగుదేశం పార్టీకి పంటి కిందరాయిలో, కొరకురాని కొయ్యగా మారారు. ప్రత్యర్థులలో మరే నేత విమర్శించని స్థాయిలో ఈ ఇద్దరూ తెలుగుదేశం ముఖ్య నేతలను టార్గెట్ చేసి విమర్శలకు దిగుతుంటారు.

అందుకే ఈసారి ఎలాగైనా ఈ ఇద్దరినీ అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని తెలుగుదేశం పట్టుదలతో ఉంది.  ఇప్పటికే గన్నవరంలో వల్లభనేని వంశీకి టార్గెట్ సెట్ చేసింది. అంగ బలం, ఆర్ధిక బలం ఉన్న యార్లగడ్డ వెంకట్రావును ఇక్కడ రంగంలోకి దింపిన తెలుగుదేశం  కలిసి వచ్చే ఏ అంశాన్ని వదులుకోకుండా ప్రణాళికలు రచించుకుంటున్నది. తెలుగుదేశం ప్రణాళికాబద్ధంగా వేస్తున్న అడుగులతో  ఇక్కడ వంశీ గెలవడం సాధ్యం కాదని ఇప్పటికే పరిశీలకులు తేల్చి చెప్పేశారు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే తాజాగా ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గుడివాడలో టికెట్ ఇచ్చేది  ఎవరికో పరోక్షంగా ప్రకటించేశారు.  కష్టపడి పనిచేసే వారికే గుడివాడ టికెట్ అని   క్లారిటీ ఇచ్చేశారు. దీనిని బట్టి చూస్తే ఎన్నారై వెనిగెళ్ల రాముకి గుడివాడ టికెట్ ఇస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా అదే చెబుతున్నాయి.   

ఎన్నారై వెనిగెళ్ల రాము విషయానికి వస్తే  ఆయనకు అంగబలం అర్ధ బలంతో పాటు సామాజిక సమీకరణాలు కూడా పెద్ద ఎత్తున కలసి రానున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన రాము భార్య దళితురాలు. దీంతో ఇక్కడ ఈ రెండు సామాజివర్గాలతో పాటు ఆర్ధికంగా పరిపుష్టి ఉన్న నేతతో పాటు తాజా ఫేస్ కూడా కావడం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అవకాశమని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ వైసీపీ ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే కొడాలి నానీ మధ్య అంతర్గత కుమ్ములాటలు కూడా  తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్. తాజాగా ఎమ్మెల్యే నానీకి తెలియకుండానే.. ఎంపీ బాలసౌరి ముఖ్య అతిధిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగగా.. నానీ అనుచరులు ఈ కార్యక్రమంపై దాడులకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కుమ్ములాట జరిగింది. ఇలాంటి చిల్లర గొడవలకు తోడు ప్రభుత్వంపై వ్యతిరేకత టీడీపీ అభ్యర్థిని గెలుపు తీరాలకు చేర్చడం ఖాయం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి అమరావతి ఫ్యాక్టర్  కారణంగా కొడాలి నానీకి డిపాజిట్లు కూడా దక్కడం అనుమానమేనని అంటున్నారు.

ఇక, ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఇన్ చార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావు విషయానికి వస్తే.. 2000లో జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. మళ్లీ ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. 2004లో వెంకటేశ్వరరావును కాదని టికెట్ కొడాలికి ఇవ్వడంతో ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయారు. 2009లో అక్కడ కూడా ఓడిపోగా.. కొడాలి తెలుగుదేశం పార్టీని వీడిన  తరువాత 2014లో ఆయనకు రెండవసారి టికెట్ దక్కినా మళ్ళీ ఓడిపోయారు. దీంతో టీడీపీ 2019లో రావిని కాదని దేవినేని అవినాష్ కి టికెట్ ఇచ్చింది. ఇప్పుడు అవినాష్ కూడా వైసీపీలోకే వెళ్లడంతో రావి  ఇంచార్జిగా ఉన్నారు. రావి వెంకటేశ్వరరావు పార్టీకి విధేయుడే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటారు. కానీ, కొడాలి నానీని ఢీ కొట్టే స్థాయిలో ఆయన లేరనీ,  రావి ఆర్ధికంగా కూడా తరితూగే పరిస్థితి లేదనీ పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందుకే ఆయన సేవలను గుర్తించేలా ఆయన్ను ఎమ్మెల్సీని చేసేలా హామీ ఇచ్చిన తె7లుగుదేశం అధినేత వెనిగండ్ల రామూను తెరపైకి తీసుకు వచ్చారని చెబుతున్నారు. తెలుగుదేశం ప్రణాళిక అమలైతే.. ఆ లెక్కల ప్రకారం ఈసారి కొడాలి అసెంబ్లీ గేట్ దాటడం కష్టమే అవుతుంది అంటున్నారు.