తెలంగాణ కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్!? | all is not well in telangana congress| combined| khammam| district| joinings| over
posted on Sep 4, 2023 11:53AM
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. కొత్త ఎత్తులు, కొత్త పొత్తులు తెరపై కొస్తున్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ రాజకీయాలపై విస్పష్ట ప్రభావం చూపింది. ఆ విజయం ముందు వరకూ పరిశీలకుల అంచనాల్లో ఎక్కడో బీఆర్ఎస్, బీజేపీల తరువాత చాలా దూరంగా మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. కర్నాటక విజయంతో కాంగ్రెస్ లో ఒక్క సారిగా జోష్ కనిపించింది. అప్పటి వరకూ రచ్చకెక్కి ఉన్న విభేదాలు ఒక్కసారిగా చల్లారాయి. అంతే కాదు ఇరత పార్టీలలోని అసంతృప్తులు వరుసగా కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో లెక్కలు మారిపోయాయి.
అంతవరకు తెలంగాణ రాజకీయాల్లో హస్తం పార్టీ మూడవ స్థానంలో ఉందని చెబుతున్న విశ్లేషకుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి మొదటి స్థానంలో ఉన్న బీఆర్ఎస్ కు అత్యంత సమీపంలో రెండో స్థానంలో కి కాంగ్రెస్ వచ్చి చేరిందని చెబుతున్నారు. ఈ జోష్ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన పని లేదని విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఫలితం ముందు వరకూ తెలంగాణ బీజేపీలో కనిపించని విభేదాలు ఆ తరువాత ఒక్క సారిగా భగ్గుమన్నాయి. క్లూలెస్ గా మారిపోయిన బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టింది. అందులో భాగంగా అప్పటి వరకూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కట్టబెట్టారు. ఆ తరువాత కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ రాలేదు సరికదా.. పార్టీ పరిస్థితి ఒక్క సారిగా దిగజారిందన్న వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
అది పక్కన పెడితే కాంగ్రెస్ లో కనిపిస్తున్న జోష్ తో ఆ పార్టీకి ఆల్ ఈజ్ వెల్ అన్న వాతావరణం ఏర్పడిందా? అంటే ఆ పార్టీలోనే సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ఓవర్ లోడ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తంగా కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతున్న కొద్దీ.. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తరువాత అసమ్మతి భగ్గుమనక తప్పదన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రశాంతత తుపాను ముందు ప్రశాంతతగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి కర్నాటక కాంగ్రెస్ విజయం తరువాత తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జోక్యం పెచ్చరిల్లడం, షర్మిల పార్టీలో చేరడం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో వ్యక్తమౌతున్న వ్యతిరేకత.. అన్నిటికీ మించి సమైక్య వాదిగా ముద్రపడిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ.. తనను ఆంధ్రావాడిగా పరిగణించొద్దంటూ చేసిన ప్రకటన అన్నీ కలుపుకుని తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకలు నివురు కింద నిప్పులా ఉన్నాయనీ, ఒక సారి అభ్యర్థులు ఖరారైన తరువాత నివురు తొలగి అగ్గి బయటపడటం ఖాయమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
ఇందుకు ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పరిణామాలనే ఉదాహరణగా చూపుతున్నారు. ఆ జిల్లాలో నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ కు తిరుగులేదన్న భావన ఉండేది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో కాంగ్రెస్ జిల్లాలో తిరుగులేని శక్తిగా మారిందన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయితే ఎప్పుడైతే తుమ్మల, షర్మిలల ప్రవేశం ఖాయమైందన్న వార్తలు బయటకు వచ్చాయో అప్పుడే జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఓవర్ లోడైపోయిందన్నట్లుగా మారిపోయింది. అన్నిటికీ మించి పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ స్థానమే కావాలని ముగ్గురు నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు. వారు ముగ్గురూ కూడా నిన్న మొన్నటి వరకూ పార్టీకి దూరంగా ఉన్నవారే. ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేడో రేపో ‘హస్తం’ చేయందుకోనున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి రెడీగా ఉన్న వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ముగ్గురూ కూడా పాలేరు నుంచే పోటీ చేస్తామంటున్నారు. లగం వెంకట్రావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లి సందిగ్ధత ఏర్పడుతోంది. పార్టీలో చేరుతున్న వారంతా కీలక నేతలే. వారి అనుచరులు కూడా పార్టీలోకి వస్తారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ వర్గ పోరాటం ప్రారంభం అవుతుంది. ఇది కాంగ్రెస్ కు మేలు చేస్తుందా కీడు చేస్తుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ కలిస్తే మాత్రం కాంగ్రెస్ కు భారీ విజయాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురే కాకుండా జలగం వెంకటరావు కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఇలా జిల్లాలో కాంగ్రెస్ లో చేరిన వారు, చేరనున్నవారు, చేరతారన్న ప్రచారం జరుగుతున్న వారు అందరూ కీలక నేతలే. వారి చేరిక కచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. దీంతో వారి మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయన్నది పరిశీలకుల అంచనా. అటువంటి ఆధిపత్య పోరు కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలోనూ కాంగ్రెైస్ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉందంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక అన్నది కాంగ్రెస్ కు కత్తిమీద సామే అనడంలో సందేహం లేదు.