గుడివాడలో కొడాలి నానికి వైసీపీ పొగ | nani facing troubles from ycp| gudiwada| mp| balasourie| new| penssions| mla
posted on Sep 4, 2023 12:35PM
కొడాలి నాని.. వైసీపీలో.. ఒక్క వైసీపీలో అనేమిటి ఏపీ మొత్తంలో పరిచయం అక్కర్లేని పేరు. బూతుల నానిగా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందనడంలో సందేహం లేదు. వైసీపీ అధినేత జగన్ కు కు కొడాలి నాని వాగ్ధాటి, మీడియా సమావేశాలలో, సభలలో విపక్ష తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను విమర్శించేందుకు ఎంచుకుని ఉపయోగించే భాష అంటే ప్రత్యేక అభిమానమని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతుంటాయి. అటువంటి కొడాలి నానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో జగన్ మంత్రి పదవి ఊడబీకేశారు. దీంతో అలిగిన నాని కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో గుడివాడలోని ఓ పశువుల కొట్టంలో ఒంటరిగా పడుకుని ఉన్న కొడాలి నాని చిత్రాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే తరువాత తమాయించుకున్న కొడాలి నాని మళ్లీ ఫాంలోకి వచ్చేశారు. అందుకు జగన్ మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారనీ, కొడాలి నానిని మళ్లీ కేబినెట్ లోకి తీసుకుంటారనీ, ఆ ఫీలర్ అందడం వల్లే నాని మళ్లీ తన బూతుల ఫామ్ ను అందిపుచ్చుకుని తెలుగుదేశంపై చెలరేగిపోవడం మొదలెట్టారనీ అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే కారణాలేమైతేనేం.. జగన్ తన కేబినెట్ ను అందరూ అనుకున్నట్లుగా రెండో సారి పునర్వ్యవస్థీకరించలేదు. కానీ కొడాలి వంటి వారి బూతుల సేవలను మాత్రం పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టిన సమయంలో కొడాలి ఒకింత ఇబ్బంది పడ్డారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. అప్పట్లో జగన్ స్వయంగా చెప్పినా వర్సిటీ పేరు మార్పునకు అనుకూలంగా కొడాలి నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. ఆ సమయంలోనే కొడాలి నానికి వైసీపీలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
తరువాత ఏమైందో, ఎలా సమన్వయం కుదిరిందో కానీ కొడాలి నాని హవా వైసీపీలో కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఎన్నికల ముంగిట కొడాలి నానికి సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశంగా మారింది. గుడివాడ నియోజకవర్గం అంటే కొడాలి నాని అడ్డాగా, ఆ నియోజకవర్గంలో కొడాలి నాని ప్రమేయం, అనుమతి లేకుండా ఏ కార్యక్రమం జరిగే అవకాశం ఉండదు. అటువంటిది కొడాలి నానికి కనీస సమాచారం కూడా లేకుండా నియోజకవర్గంలో కొత్త పించన్ల కార్యక్రమం జరిగిపోయింది. దీనిని కొడాలి నాని అనుచరులు అడ్డుకోవడంతో గలాటా, ఘర్షణలు జరిగాయి. కొడాలి నాని ప్రమేయం లేకుండా కొత్త పింఛన్ల కార్యక్రమానికి ఎంపీ బాలశౌరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ఆశీస్సులు, అనుమతి ఉందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.
ఔను శనివారం (ఆగస్టు 2) గుడివాడలోని కొత్త మున్సిపల్ కార్యాలయంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్య క్రమం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కొడాలి నానికి సమాచారం లేదు. దీంతో ఎమ్మెల్యేకు తెలియకుండా ఈ కార్యక్రమం ఏమిటంటూ నాని వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాలశౌరి అనుచరులు, కొడాలి నాని అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ వల్లభనేని బాలశౌరినికి జగన్ ప్రోత్సాహం, అండదండలు ఉన్నాయన్న అనుమానం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నది. వచ్చే ఎన్నికలలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బాలశౌరిని నిలబెట్టి.. నానిని లోక్ సభ బరిలో దింపాలన్నది జగన్ యోచనగా పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే గుడివాడలో బాలశౌరిని ప్రోత్సహిస్తూ.. నానిని బలహీనం చేసే కార్యక్రమానికి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం కూడా కొడాలి నాని ఓటమే ధ్యేయంగా నియోజకవర్గంలో బలోపేతమయ్యే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో కొడాలి నానికి సొంత పార్టీలోనే పొగ పెడుతుండటంతో ఆయన జరగుతున్నది చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం వినా చేయగలిగిందేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.