కేశినేని నాని బెంగటిల్లుతున్నారా? దెబ్బతీస్తున్నారా? | kesineni worry about political future| announce| unilateral| party| ticket| confusem tdp
posted on Sep 4, 2023 2:26PM
విజయవాడ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ భవిష్యత్ పై బెంగటిల్లుతున్నారా? తన స్థాయిని మరిచి మరీ సొంత పార్టీ తెలుగుదేశంపై, ఆ పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించిన కేశినేని నాని అదే సమయంలో అధికార వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాకుండా వారిపై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కేశినేని నాని వైఖరితో, వ్యవహరిస్తున్న తీరుతో విసుగెత్తిన తెలుగుదేశం ఆయన పార్టీలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అని ఫిక్స్ పోయింది. విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కేశినేని నాని సోదరుడిని నిలబెట్టి గెలిపించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు విస్పష్ట సంకేతాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కేశినేని నాని వైసీపీ గూటికి చేరడం ఖాయమనీ, దీంతో బెజవాడ లోక్ సభ బరి అన్నాదమ్ముల సవాల్ గా మారుతుందనీ అంతా భావించారు. అంతలోనే ఏమైందో ఏమో కేశినేని నాని బెజవాడ లోక్ సభ బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా తాను రంగంలో ఉంటానని తనకు తానే ప్రకటించేసుకున్నారు.
టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా నంటూ నేల విడిచి సాము చేసిన చందంగా ప్రకటనలు గుప్పించిన కేశినేని నాని ఇప్పుడు తెలుగుదేశం వినా గత్యంతరం లేదన్నట్లు బేలగా మాట్లాడుతున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెడతానని , వచ్చే ఎన్నికలలో 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చేశారు. తనకు పార్లమెంట్ టిక్కెట్ ప్రకటించుకోవడమే కాకుండా… తనతో పాటు బేగ్ అనే నేతకూ ఏకపక్షంగా తెలుగుదేశం టికెట్ ప్రకటించేయడం ద్వారా కేశినేని నాని తన సోదరుడికి చెక్ పెట్టే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర బెజవాడలో సాగిన సందర్భంలో పార్టీ ఎంపీ అయి ఉండి కూడా కేశినేని నాని కనీసం అటువైపు చూడలేదనీ, ఇప్పుడు ఇలా ఏకపక్షంగా తనే తెలుగుదేశం అభ్యర్థినంటూ బాహాటంగా ప్రకటనలు గుప్పించడం వెనుక తెలుగుదేశం క్యాడర్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వ్యూహం ఉందనీ తెలుగుదేశం శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఇప్పటికే బెజవాడలో కేశినేని నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు కేశినేని చిన్నిని తెలుగుదేశం అధినేత ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించే తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం రెబల్ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పార్టీని దెబ్బతీయాలన్న వ్యూహంతో కేశినేని నాని అడగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.