76 మందితో టీడీపీ తొలి జాబితా రెడీ?! | tdp first list ready| 76names| candidates| announce| alliances| pressure| ap
posted on Sep 5, 2023 6:42AM
ఒకవైపేమో దేశమంతా ఒకేసారి ఎన్నికలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాదిలోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగినా ఆశ్చర్యమే లేదనిపిస్తుంది. ఒకవేళ జమిలి ఎన్నికల ప్రతిపాదన అమల్లోకి రాకపోయినా ఏపీలో ఎన్నికలకు ఏడెనిమిది నెలలే సమయం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల పనితీరు, సర్వేల ఫలితాల మీద దృష్టి పెట్టాయి. అధికార వైసీపీని తీసుకుంటే ఒకవైపు ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం, మరోవైపు ప్రభుత్వ వర్గాలతో రహస్య సర్వే, మరో రెండు ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వేల ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటుంది. త్వరలో రాబోతున్న సర్వేల తుది ఫలితాల ఆధారంగా వైసీపీ తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక, ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే దూకుడుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ నేతలలో బయటపడుతున్న అసంతృప్తి, టీడీపీ నేతలు ఎక్కడకి వెళ్లినా క్లియర్ కట్ గా ప్రజలు కోరుకుంటున్న మార్పు టీడీపీకి ఎక్కడ లేని జోష్ తీసుకొస్తున్నాయి. నో డౌట్ గెలుపు మనదే అన్నట్లు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజలు మెచ్చే అభ్యర్థులు, గెలుపు తెచ్చే అభ్యర్థుల కోసం ముమ్మర వేట ప్రారంభించారు. టీడీపీ కూడా రెండు మూడు రకాల సర్వేలు చేయిస్తున్నది. ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ బృందం చేపట్టిన సర్వేతో పాటు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన వారితో మరో సర్వే చేయించుకుంటున్నారు. ఇవి రెండూ కాకుండా మరో ప్రైవేట్ సంస్థ కూడా టీడీపీ కోసం సర్వే చేపడుతున్నది.
ఈ సర్వేల ఫలితాలన్నీటితో కలిపి ఇప్పటికే తొలి విడత జాబితా సిద్ధంకాగా త్వరలోనే ఈ తొలి జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. టీడీపీ తొలి జాబితాలో 76 మంది పేర్లు ఉంటాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి జిల్లాకు అయిదారుగురు వంతున ఈ తొలి జాబితాలో చోటు దక్కనుందని అంటున్నారు. వైసీపీలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను పక్కన పెడితే మిగిలిన పందొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఈ జాబితాలో ఉంటాయని.. అలాగే ఎలాంటి గ్రూపులూ లేకుండా, బలంగా ఉంటూ ప్రలలతో మమేకం అవుతున్న అభ్యర్థులను కూడా ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉందనీ పార్టీ వర్గాల సమాచారం. అంటే ఈ తొలి జాబితాలో ఎలాంటి వివాదాస్పద వ్యవహారాలు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు ఉండనున్నారు.
కాగా, చాలా కాలంగా ఏపీలో పొత్తులు ఉంటాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కుదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ.. లేకపోతే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ తొలి జాబితా విడుదల సమయానికి ఈ పొత్తుల వ్యవహారం తేలుతుందా అన్న చర్చ తెరపైకి వస్తున్నది. అయితే, పొత్తులు ఉన్నా సరే టీడీపీ అత్యధిక స్థానాలలో పోటీ చేస్తుందని చెప్పడానికే తొలి జాబితాలో టీడీపీ బిగ్ నంబర్ తో వస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తమకు పాతిక స్థానాలు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నది. మరోవైపు జనసేన కూడా భారీగానే ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే టీడీపీ 76 మందితో తొలి జాబితా ప్రకటించి పొత్తులలో అప్పర్ హ్యాండ్ సాధించాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అదే నిజమై పొత్తులతో సంబంధం లేకుండా టీడీపీ ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తే జనసేన, బీజేపీలపై ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది.